కరీంనగర్ ఆసుపత్రిలో రూ.4.50 కోట్ల అక్రమాలు
కలెక్టరేట్‌లో ఏఐఎఫ్‌బీ ఫిర్యాదు.. నిధుల రికవరీకి డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 2021 నుంచి 2024 మధ్య జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.4.50 కోట్ల నిధుల దుర్వినియోగంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) డిమాండ్ చేసింది. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఈ మేరకు ఫిర్యాదు అందజేసింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ.. అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ నవీనతో పాటు పలువురు డాక్టర్లపై వచ్చిన ఆరోపణలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. 2023లోనే నాటి డీఎంహెచ్‌వో లలితదేవి అక్రమాలపై నివేదిక ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. హాస్పిటల్‌కు చెందిన హెచ్‌డీఎస్, కాయకల్ప నిధులతో పాటు వాహనాల ఇంధన ఖర్చులకు సంబంధించిన రూ.4.50 కోట్ల వ్యయాలకు ఎలాంటి బిల్లులు, వోచర్లు లేవని ఆరోపించారు. ఆసుపత్రి బ్యాంక్ ఖాతాలపై సమగ్ర ఆడిట్ జరిపి, బాధ్యుల నుంచి నిధులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని హామీ ఇచ్చారు.

