సెర్ప్ వీవోఏల సమ్మె.. బండి సంజయ్‌కు వినతి
కనీస వేతనం రూ.20 వేలు చేయాలని డిమాండ్
రాష్ట్రవ్యాప్త పిలుపుతో శంకరపట్నంలో నిలిచిన విధులు
కాకతీయ, శంకరపట్నం : సెర్ప్‌లో వివోఏలుగా పనిచేస్తున్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఐకేపీ వివోఏ ఎంప్లాయిస్ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు బుధవారం శంకరపట్నం మండలంలో వీవోఏలు రాష్ట్రవ్యాప్త సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరపట్నం మండల పరిధిలోని 38 మంది వీవోఏలు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అనంతరం కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. వీవోఏలకు కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తింపునిస్తూ హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన వీవోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలని, ఆరోగ్య బీమా సౌకర్యం అందించడంతో పాటు జీవో నంబర్ 58ను తక్షణమే సవరించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

