నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి రూపురేఖలు!
రూపుదిద్దుకుంటున్న సమగ్ర మాస్టర్ ప్లాన్
మంత్రి పొంగులేటి ఆదేశాలతో రంగంలోకి అధికారులు
వారసత్వ శాఖ ఉన్నత స్థాయి బృందం క్షేత్రస్థాయి పరిశీలన
కాకతీయ, పాలేరు : ఖమ్మం జిల్లాలోని చారిత్రక నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ క్షేత్రం అభివృద్ధి కోసం ఇప్పటికే రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాటు ఈ చారిత్రక వారసత్వ ప్రదేశానికి అంతర్జాతీయ హంగులు అద్దేందుకు ఇంకా ఎంత వ్యయం అవుతుంది, ఎలాంటి ఆధునిక పనులు చేపట్టాలనే అంశాలపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాటి, బుద్ధవనం ప్రాజెక్ట్ మెంటార్ సి.ఆంజనేయ రెడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారులు, పురావస్తు నిపుణుల బృందం ఇక్కడ విస్తృతంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. మంజూరైన నిధుల వినియోగంతో పాటు భవిష్యత్ నిధుల అంచనాలు, ల్యాండ్ స్కేపింగ్, పర్యాటక హంగుల రూపకల్పనపై నిపుణుల బృందం క్షేత్రస్థాయిలోనే సుదీర్ఘంగా సమీక్షించింది.
ఎన్‌జీఆర్‌ఐ సహకారంతో భూగర్భ సర్వే
ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా కేవలం ఉపరితల తవ్వకాలకే పరిమితం కాకుండా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) సహకారంతో అత్యాధునిక భూగర్భ జియోఫిజికల్ సర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనిద్వారా భూగర్భంలో దాగివున్న శతాబ్దాల నాటి చారిత్రక అవశేషాలను శాస్త్రీయంగా వెలికితీసి రక్షించనున్నారు. అలాగే భవిష్యత్తులో పర్యాటక వసతుల విస్తరణ కోసం స్తూపం పరిసరాల్లో సుమారు నాలుగు ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు తీర్మానించారు.
ఇక్కడకు వచ్చే పర్యాటకుల కోసం బౌద్ధ చరిత్రను కళ్లకు కట్టేలా త్రీడీ ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, ఆడియో-విజువల్ గ్యాలరీలు, ఓపెన్ ఎయిర్ అంఫీ థియేటర్, అంతర్జాతీయ స్థాయి వాకింగ్ మార్గాలు, ఆకర్షణీయమైన లైటింగ్ వంటి అత్యాధునిక మౌలిక వసతులను ఈ నివేదికలో చేర్చనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి వ్యయ అంచనాలతో కూడిన ఈ ‘సమగ్ర నివేదిక’ను రాబోయే రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామని వారసత్వ శాఖ డైరెక్టర్ వెల్లడించారు.

