హెల్త్ కార్డుల కోతలపై ఉద్యోగుల అభ్యంతరం!
స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించాలి
ఆస్పత్రులు, చికిత్సల వివరాలపై ఇప్పటికీ రాని స్పష్టత
మే నెల జీతాల నుంచి ముందస్తు సమాచారం లేకుండానే కటింగ్‌లు
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఖాద్రీ
కట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల హెల్త్ కార్డుల అమలుకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించకుండానే, మే నెల జీతాల నుంచి కోతలు విధించడం ఎంతమాత్రం సరికాదని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ విమర్శించారు. ప్రభుత్వ ఆరోగ్య కార్డుల కింద ఏయే ఆస్పత్రులు ఉచిత సేవలు అందిస్తాయి, అసలు ఏయే వ్యాధులకు చికిత్సలు వర్తిస్తాయి అనే ప్రధాన అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఉద్యోగుల వివరాల నమోదు ప్రక్రియ కూడా ఇంకా పూర్తిగా ముగియకముందే, ఇలా జీతాల నుంచి అనాలోచితంగా కోతలు విధించడం అన్యాయమని పేర్కొన్నారు.
అభిప్రాయాలు సేకరించాలి..
ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జీతాలు కట్ చేయడం సరైన విధానం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను పిలిచి వారి అభిప్రాయాలను సేకరించాలని, ఆరోగ్య కార్డుల అమలుకు సంబంధించిన పూర్తి నిబంధనలతో కూడిన జీవోను విడుదల చేయాలని కోరారు. ఈ హెల్త్ స్కీమ్‌లో చేరేందుకు ఆసక్తి ఉన్న ఉద్యోగుల నుంచి మాత్రమే కోతలు విధించాలని, అందరికీ ఒకే విధంగా ఒకే లాంటి కోతలు విధించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే మే నెల జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని తక్షణమే తిరిగి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ఎం.ఏ. ఖాద్రీ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.

