కేసుల దర్యాప్తులో జాప్యం వద్దు : ఎస్పీ మహేష్ బి. గితే
వేములవాడ సబ్-డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం
కాకతీయ, వేములవాడ : జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులో పారదర్శకమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా చూడాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులను ఆదేశించారు. వేములవాడ సబ్-డివిజన్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు, నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలు, దర్యాప్తు పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. దీర్ఘకాలిక పెండింగ్ కేసుల పరిష్కారానికి అవసరమైతే న్యాయ సలహాలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంచేలా ప్రతి సీఐ, ఎస్సైలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. స్థానిక ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి, ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, మధుకర్, ఎస్సైలు పాల్గొన్నారు.

