ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ
కాకతీయ, రుద్రంగి : రుద్రంగి మండలం మానాల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్ పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుర్ర శంకర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు ప్రభుత్వ పాఠశాలలే పునాది అని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి గ్రామపంచాయతీ సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఉప సర్పంచ్ దాసరి అశోక్ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం గ్రామ ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతి మాట్లాడుతూ, పాఠ్యపుస్తకాల ప్రాముఖ్యతను వివరించారు. పుస్తకాలను సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో చదివి విద్యలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు లక్కాకుల రమేష్, మాజీ వైస్ ఎంపీపీలు పిసరి భూమయ్య, బాధనవేని రాజారాం, విడిసి చైర్మన్ అంగరకుల మహేష్, నాయిని రాజేశం, చెదలు నవీన్, లక్కాకుల స్వామి, జక్కు గంగాధర్, తాటికొండ శ్రీనివాస్, బత్తుల వెంకట్, గ్రామస్థులు పాల్గొన్నారు.

