ఆ ఇద్దరికి బదిలీ లేదా..?!
సర్వీసు రూల్స్ వారికి వర్తిచవా..?!
మున్సిపాలిటీలో పదేళ్లుగా తిష్ఠ
సరిత, మాధవిలపై బదిలీలపై వసూళ్ల ఆరోపణలు
ఇంటి పన్నులు, ఫైళ్ల క్లియరెన్స్‌లో పట్టణ ప్రజలకు వేధింపులు
సస్పెన్షన్ చరిత్ర ఉన్నా.. రాజకీయ అండతో పాతుకుపోయిన వైనం
వరంగల్ సీడీఎమ్ఏ కార్యాలయం అధికారుల సహకారం
విచారణ జరిపి బదిలీ చేయాలని ప్రజలు, ప్రజాసంఘాల డిమాండ్
కాకతీయ, మణుగూరు : ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులది. కానీ, మణుగూరు మున్సిపాలిటీలో మాత్రం సరిత, మాధవి అనే ఇద్దరు అధికారులు తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తూ, ‘వారే చట్టం, వారే పాలకులు’ అన్నట్లుగా తీరును మార్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సస్పెన్షన్ చరిత్ర ఉన్నప్పటికీ, రాజకీయ, అధికార అండతో దశాబ్ద కాలంగా ఒకే చోట తిష్టవేసి, మున్సిపాలిటీని తమ గుప్పిట్లో పెట్టుకోవడం పట్ల స్థానికులు, ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
సస్పెన్షన్ చరిత్ర ఉన్నా.. మణుగూరులోనే తిష్ట
గతంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాల ఆరోపణలతో వీరిద్దరూ సస్పెన్షన్‌కు గురైనట్లు సమాచారం. అయినా, ఉన్నతాధికారుల అండదండలతో, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని తిరిగి మణుగూరు మున్సిపాలిటీలో చేరి, నేటికీ ఇక్కడే కొనసాగుతుండటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమకున్న కుల బలంతో వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సీడీఎమ్ఏ కార్యాలయం అధికారుల సహకారం
ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొంత మొత్తాన్ని వరంగల్ సీడీఎమ్ఏ కార్యాలయంలోని ఒక అటెండర్ ద్వారా ముడుపులుగా చెల్లించి, తమ బదిలీలను ఆపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ ప్రక్రియ వల్ల మణుగూరు మున్సిపాలిటీలో పారదర్శకత లోపించిందని, నిజాయితీగా పని చేసే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని మున్సిపల్ కార్యాలయ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మణుగూరులో వీరు పాతుకుపోవడం వల్ల ఇంటి పన్నుల విషయంలో ప్రజలను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫైళ్ల క్లియరెన్స్, లైసెన్స్‌లు, టెండర్ల విషయంలో అనధికార వసూళ్లు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ పార్టీ నాయకుల మద్దతుతో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా వీరు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
సస్పెన్షన్ చరిత్ర ఉన్న అధికారులు ఇక్కడ కొనసాగడం సరికాదని, వెంటనే వీరిపై నిష్పాక్షిక విచారణ జరిపి బదిలీ చేయాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, మణుగూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ అరాచకంపై పైస్థాయిలో ఫిర్యాదులు చేసేందుకు ప్రజలు, నాయకులు సిద్ధమవుతున్నారు.

