మా ఊర్లోకి ప్రైవేటు పాఠశాలల బస్సులు నిషేధం
ప్రభుత్వ విద్యకే పెద్దపీట.. సంక్షేమ పథకాల్లో తొలి ప్రాధాన్యం
రేపాక, పెద్దలింగాపూర్ గ్రామాల చారిత్రాత్మక నిర్ణయం
ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా కీలక తీర్మానం
కాకతీయ, ఇల్లంతకుంట : ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక, పెద్దలింగాపూర్ గ్రామ పంచాయతీలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రులను ప్రోత్సహించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రభావాన్ని తగ్గించాలని ఆయా గ్రామ పాలకవర్గాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి చదివించే కుటుంబాలకు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో తొలి ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించారు. రేపాక సర్పంచ్ కథ మల్లేశం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ అపోహలతో తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్నారని, ఈ పరిస్థితిని మార్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామంలో ప్రభుత్వ విద్యపై అవగాహన పెంచడంతో పాటు, ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఇకపై గ్రామ పరిధిలో అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ విద్యే ముద్దు..
పెద్దలింగాపూర్ సర్పంచ్ గన్నేరం వసంత ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ ఇదే తరహా తీర్మానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితేనే నాణ్యమైన విద్యాబోధన సాధ్యమని ఆమె పేర్కొన్నారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించే తల్లిదండ్రులకు గ్రామస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాల అమలులో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.
రెండు గ్రామ పంచాయతీలు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విద్యాభివృద్ధికి ఇది ఒక కీలక ముందడుగు అని ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. గ్రామస్తులు కూడా ఈ నిర్ణయాలను స్వాగతిస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.

