చదువుతో పాటు నైపుణ్యాలను వెలికి తీయాలి
భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్
ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు..
విద్యార్థులతో సరదాగా క్రికెట్ ఆట
కాకతీయ, దుమ్ముగూడెం: విద్యార్థులకు చదువుతో పాటు వారికి ఇష్టమైన క్రీడల పట్ల మక్కువ కలిగించి, వారిలో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. శనివారం దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, లైబ్రరీ, డైనింగ్ హాల్, విద్యార్థులకు వండిస్తున్న భోజనం మరియు నోటు పుస్తకాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన విద్యార్థుల మానసిక స్థితిగతులను గమనిస్తూ ఉండాలని సూచించారు. రాబోయే వర్షాకాలంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశించారు.

పిల్లలతో సరదాగా క్రికెట్
అనంతరం చిన్న ఆర్లగూడెం, కొంగ వాగు గుంపు జీపీఎస్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. పిల్లల చేత ఉద్దీపన వర్క్ బుక్ లోని అంశాలను చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. సరదాగా పిల్లలతో క్రికెట్ ఆడి, క్రీడలకు సంబంధించిన మెలకువలను చిన్నారులకు నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సోమశేఖర్, వార్డెన్ లక్ష్మణరావు, ఎస్సీఆర్పీ విటల్, జీపీఎస్ పాఠశాల హెచ్ఎంలు పాపారావు, కన్నారావు, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

