ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆకస్మక తనిఖీ
క్రిటికల్ కేర్ భవనం పనులు వేగవంతం చేయాలని ఆదేశం
విడివోస్ కాలనీలో ‘ఎస్ఐఆర్’ ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పరిశీలన
కాకతీయ,ఖమ్మం : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే నిరుపేద రోగులకు నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించడంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వద్దని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని మంత్రి ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులు, అత్యవసర విభాగాలను పరిశీలించిన ఆయన.. మందుల లభ్యత, పారిశుధ్య నిర్వహణ, వైద్యులు, సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో నేరుగా ముచ్చటించి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ భవనం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఎంతో మర్యాదపూర్వకంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా ఆసుపత్రి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా, దోమలు వ్యాపించకుండా పారిశుధ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రధాన రహదారికి ఇరువైపులా ఆకర్షణీయమైన మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, అంతర్గత రోడ్లకు అవసరమైన మరమ్మతులు తక్షణమే చేపట్టాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు.
విడివోస్ కాలనీలో ఓటరు సర్వే పరిశీలన
అనంతరం, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని విడివోస్ కాలనీలో కొనసాగుతున్న ఓటరు మ్యాపింగ్, ఇంటింటి సర్వే ప్రక్రియను మంత్రి తుమ్మల స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్న బూత్ లెవెల్ అధికారులను (బీఎల్వోలు) అడిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క ఓటరు వివరాలు జాబితాలో నమోదయ్యేలా రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్, వైద్య, మున్సిపల్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

