మాదక ద్రవ్యాల ఉచ్చులో పడొద్దు
వ్యసనాల నుంచి బయటపడితే కేసుల్లేవు.. ఉచిత వైద్యం
ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి
జిల్లా జైలులో ఖైదీలకు ప్రత్యేక అవగాహన సదస్సు
కాకతీయ ఖమ్మం టౌన్ : తాత్కాలిక ఆనందం కోసం గంజాయి, డ్రగ్స్ వంటి సామాజిక మహమ్మారుల బారిన పడి బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి సూచించారు. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఖమ్మం జిల్లా జైలులో ఖైదీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ.. ఖైదీలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, శారీరక, మానసిక దుష్పరిణామాలు మరియు వాటి నుంచి విముక్తి పొందే మార్గాలపై పూర్తి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. జైలు జీవితం ముగిసి బయటకు వెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరూ సమాజంలో ఆరోగ్యకరమైన, నేరరహితమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, అందుకోసమే ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన శిక్షలు
ముఖ్యంగా వయసు ప్రభావం, చెడు స్నేహాలు లేదా కొన్ని క్లిష్ట పరిస్థితుల వల్ల యువత ఎక్కువగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని ఏసీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీపీఎస్ యాక్ట్‌పై ఖైదీలకు క్షుణ్ణంగా వివరించారు. మాదకద్రవ్యాలను కలిగి ఉండడం, సేవించడం, ఇతర ప్రాంతాలకు రవాణా లేదా సరఫరా చేయడం, ల్యాబ్‌లలో తయారు చేయడం, క్రయవిక్రయాలు సాగించడం అన్నీ కూడా భారతీయ చట్టాల ప్రకారం అత్యంత కఠినమైన క్రిమినల్ నేరాలని.. ఇటువంటి పనులకు పాల్పడితే కోర్టుల ద్వారా దీర్ఘకాలిక శిక్షలు తప్పవని హెచ్చరించారు.
స్వచ్ఛందంగా వస్తే స్వాగతిస్తాం!
ఒకవేళ ఎవరైనా తెలియక మాదకద్రవ్యాలకు అలవాటు పడి, ప్రస్తుతం వాటి నుంచి విముక్తి పొందాలని గట్టి సంకల్పంతో స్వయంగా ముందుకు వస్తే వారిపై ఎలాంటి నేర విచారణా (పోలీస్ కేసులు) ఉండదని ఏసీపీ రమణమూర్తి ఒక మంచి అవకాశాన్ని లబ్ధిదారులకు వివరించారు. అలాంటి వారికి ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీ-ఎడిక్షన్ సెంటర్ల ద్వారా ఉచితంగా పటిష్టమైన వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా జైలు సూపరిండెంట్ శ్రీధర్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్, జైలర్ సక్రూ మరియు జైలు సిబ్బంది, ఖైదీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

