వృథా అవుతున్న ప్రజాధనం
చేర్యాల మున్సిపాలిటీలో సిబ్బంది భారం
అనవసర నియామకాలపై ప్రజా వ్యతిరేకత
సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్న చైర్పర్సన్, కమిషనర్
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో అవసరానికి మించి సిబ్బందిని కొనసాగించడం వల్ల నెలకు లక్షల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని భారం కంటే సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ ఖజానాపై అనవసర ఆర్థిక భారం పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. గత పాలకవర్గం నిర్లక్ష్యంతో అవసరానికి మించి సిబ్బందిని నియమించడం వల్ల, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులు సిబ్బంది జీతాలకే వెచ్చిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది:
మొత్తం జనాభా: 18,330, వార్డులు: 12, సిబ్బంది వివరాలు: కార్యాలయ అధికారులు – 09, ఔట్సోర్సింగ్ సిబ్బంది – 10, మున్సిపల్ కార్మికులు – 72. నెలవారీ జీతాలు: సుమారుగా రూ. 11,70,000., వాహనాల మెయింటెనెన్స్ & ఇతర ఖర్చులు: నెలకు రూ. 2,30,000. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి ప్రజలకు నేరుగా ఉపయోగపడే అంశాలపై నిధులు ఖర్చు చేయాల్సి ఉండగా, ఈ తరహా వృథా ఖర్చులు సరైన విధానం కాదని స్థానికులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ స్పందిస్తూ, “వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తాం. అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజాధనం వృథా కాకుండా తగిన నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. అలాగే, మున్సిపల్ కమిషనర్ సుంచు నాగేందర్ మాట్లాడుతూ, “అవసరానికి మించి ఉన్న సిబ్బందిని తొలగించడం లేదా ఇతర శాఖలకు సర్దుబాటు చేసే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజాధనం వృథా కాకుండా బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.

