వరుణ దేవా..! కరుణించు
బతుకమ్మ ఆడుతూ ఉపాధి కూలీల ప్రార్థన
కాకతీయ, ఇల్లంతకుంట: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, రైతులు సంతోషంగా వ్యవసాయ పనులు చేపట్టాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఉపాధి హామీ మహిళా కూలీలు గురువారం వినూత్నంగా బతుకమ్మ ఆడి వరుణ దేవుడిని ప్రార్థించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సాగుపై రైతులు, పనుల కోసం కూలీలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, మహిళలు ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలోనే ఒకచోట చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలతో వరుణ దేవుడిని వేడుకున్నారు.
రైతులకు, కూలీలకు మేలు జరగాలని..
వ్యవసాయమే జీవనాధారమైన గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు పడితేనే రైతులకు పంటలతో పాటు కూలీలకు పని దొరుకుతుందని మహిళలు పేర్కొన్నారు. ”వరుణ దేవుడా కరుణించు.. చెరువులు, కుంటలు నిండేలా వర్షాలు కురిపించు” అంటూ భక్తిశ్రద్ధలతో పాటలు ఆలపించారు. వర్షాలు లేక పంటలు ఆలస్యమైతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని, సకాలంలో వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు అందరూ సుభిక్షంగా ఉంటారని వారు ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మను వర్షాభావ సమయంలో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునే ఆచారంలో భాగంగా వారు ఈ ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా ఉపాధి హామీ కూలీలు పాల్గొని వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు.

