సొంత జీవోతో శ్రీకర్ ఇసుక దందా
జిల్లా స్థాయి అధికారులను గుప్పిట్లో పెట్టుకుని గోదావరి దోపిడీ
డీడీ తీసిన లారీలను నడి గోదావరిలోకి దింపి నిబంధనలకు విరుద్ధంగా లోడింగ్
అక్రమ ఆస్తులపై ఈడీ, ఏసీబీ, విజిలెన్స్ సంస్థలు దర్యాప్తు చేపట్టాలి
ఎన్‌హెచ్‌ఆర్‌సీ నేత సలుగు భిక్షపతి
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక ర్యాంపుల నిర్వహణలో ప్రభుత్వ అధికారిక నిబంధనలను, జీవోలను పూర్తిగా పక్కనబెట్టి.. కాంట్రాక్టర్ శ్రీకర్ తన సొంత జీవోతో ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ సలుగు భిక్షపతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన ‘కాకతీయ’ పత్రికతో మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా శ్రీకర్ ఇసుక దందాల్లో అక్రమాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ముందస్తుగా ముడుపులు ముట్టజెప్పి, ఇసుక ర్యాంపులను తన కైవసం చేసుకోవడం అతనికి అలవాటుగా మారిందని విమర్శించారు.
అధికారుల అండతోనే పట్టా భూముల్లో తోలకాలు
భద్రాద్రి జిల్లాలోని కొంతమంది కీలక జిల్లా స్థాయి అధికారులను శ్రీకర్ తన కబందహస్తాల్లో పెట్టుకుని ఈ భారీ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాడని భిక్షపతి దుయ్యబట్టారు. డీసిల్టేషన్ పేరుతో పూర్తిగా అక్రమ ఇసుక దందా సాగుతోందని, ఏకంగా రైతుల పట్టా భూముల్లో డీసిల్టేషన్ దందా చేయడం దుర్మార్గమన్నారు. నిబంధనల ప్రకారం క్వారీ బయట లోడింగ్ జరగాల్సి ఉండగా, డీడీ లతో వచ్చిన లారీలను సరాసరి నడి గోదావరి ప్రవాహంలోకి దింపి లోడింగ్ చేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు చర్ల ప్రాంతంలో కేవలం లక్ష రూపాయలతో మణుగూరుకు వచ్చిన శ్రీకర్.. నేడు ఇసుక అక్రమ వ్యాపారం ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించి జిల్లానే ఏలే స్థాయికి ఎలా ఎదిగాడని ప్రశ్నించారు. గతంలో బీటీపీఎస్ కు ఎలాంటి రశీదులు లేకుండా 2 లక్షల క్యూబిక్ మీటర్ల ‘జీరో ఇసుక’ తోలిన సంగతి, అందుకుగాను ప్రభుత్వానికి రూ. 70 లక్షల జరిమానా కట్టిన విషయం అందరికీ తెలుసన్నారు.
‘కాకతీయ’ విలేకరులను బెదిరిస్తే ఊరుకోం
ఇసుక క్వారీల్లో జరుగుతున్న అక్రమాలపై ‘కాకతీయ’ పత్రిక నిఖార్సయిన నిజాలను ప్రచురిస్తుంటే, తట్టుకోలేక శ్రీకర్ తన బినామీలతో విలేకరులపై బెదిరింపులకు పాల్పడటం, పత్రికపై దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని భిక్షపతి హెచ్చరించారు. నిజాలను అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. శ్రీకర్ అక్రమ ఇసుక దందా ద్వారా సంపాదించిన వందల కోట్ల ఆస్తులపై ఏసీబీ, విజిలెన్స్, ఈడీ అధికారులు తక్షణమే స్పందించి దాడులు చేయాలని, ఆ అక్రమ ఆస్తులను జప్తు చేసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తరఫున సలుగు భిక్షపతి డిమాండ్ చేశారు.

