రైతు ఆశీర్వాదం కాదు.. క్షమాపణ సభ పెట్టండి
వరంగల్ డిక్లరేషన్ అమలులో ప్రభుత్వం విఫలం
ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు
50 రోజులైనా ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కాలేదు
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను వెంటనే పునరుద్ధరించాలి
: బీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజ్
కాకతీయ, చింతకాని : ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న సభ ‘రైతు ఆశీర్వాద సభ’ కాదని, అది రైతులకు క్షమాపణ చెప్పే సభగా మార్చాలని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం చింతకానిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు రైతు భరోసా పేరుతో సభలు పెట్టి రైతులను ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక గ్రామంలో అయినా ప్రతి రైతుకూ పూర్తి స్థాయిలో రైతు భరోసా అందిందని సీఎం గానీ, మంత్రులు గానీ నిరూపిస్తే వారిని అభినందిస్తామని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్‌లోని ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా, కౌలు రైతులకు సాయం, రూ. 2 లక్షల రుణమాఫీ వంటి హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు.
ధాన్యం అమ్మి 50 రోజులు దాటినా పైసల్ రాలేదు
రైతుల నుంచి పంట కొనుగోలు చేసిన తర్వాత 50 రోజులు గడిచినా నేటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని లింగాల కమల్ రాజ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రతి గింజను కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ చేశామని, కానీ నేడు బకాయిలు చెల్లించకుండా రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు. రైతు భరోసా, రైతు బీమా, పంట కొనుగోలు బకాయిలు, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించని ఈ ప్రభుత్వాన్ని రైతులు ఎందుకు ఆశీర్వదించాలని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రతి సీజన్ ప్రారంభానికి ముందే రైతు బంధు అందేదని, యూరియా కొరత లేకుండా చూశామని గుర్తుచేశారు.
ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. భద్రత తగ్గింపు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని కమల్ రాజ్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై రాజద్రోహం కేసు నమోదు చేయడం, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కల్పించిన భద్రతను తగ్గించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. నక్సలైట్ ప్రాంతాల్లో విశేష సేవలందించిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు గతంలో ఉన్న భద్రతను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న జరిగే సభకు ముందే రైతుల పంట కొనుగోలు బకాయిలు, రైతు భరోసా, రైతు బీమా పెండింగ్ మొత్తాలను విడుదల చేయాలని, ఆ తర్వాతే సభ నిర్వహించే నైతిక హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి సభ్యుడు మంకెన రమేష్, పార్టీ మండల కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, మాజీ ఎంపీపీ పొనుగోటి రత్నాకర్, నేతలు గడ్డం శ్రీను, అప్పారావు, షబ్బీర్, లాయర్ బాబు, చాపలమడుగు వీరబాబు, షేక్ మీరా సాహెబ్, కోపూరి నవీన్, నాదెండ్ల వెంకటేష్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

