రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారా..?
రోడ్డుతో సమానంగా డివైడర్.. రాత్రివేళల్లో కనిపించని పరిస్థితి
అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా అలుగునూర్ చౌరస్తా
ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర కూడలి
డివైడర్ ఎత్తు పెంచి, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్
కాకతీయ, కరీంనగర్: నగరంలోని అలుగునూర్ చౌరస్తాలో ఇటీవల నిర్మించిన కొత్త రహదారి ప్రయాణాన్ని సులభతరం చేసినప్పటికీ, అదే రహదారిపై ఉన్న పాత డివైడర్ ఇప్పుడు వాహనదారులకు మృత్యుపాశంగా మారింది. రోడ్డు ఎత్తు పెంచి వేసినప్పటికీ, డివైడర్‌ను మాత్రం అదే స్థాయిలో వదిలేయడంతో అది రోడ్డుతో సమానంగా మారిపోయింది. ముఖ్యంగా రాత్రివేళల్లో డివైడర్ అస్సలు కనిపించక, వాహనదారులు అకస్మాత్తుగా ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నారు. అలుగునూర్ చౌరస్తా కరీంనగర్ నగరంలోని అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటి. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారితో పాటు సిద్ధిపేట వైపు వెళ్లే వాహనాలన్నీ ఈ కూడలి మీదుగానే ప్రయాణిస్తాయి. నిత్యం వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలతో ఈ మార్గం కిటకిటలాడుతుంటుంది. అయితే, డివైడర్‌కు తగిన ఎత్తు లేకపోవడం, దానికి రిఫ్లెక్టర్లు, క్యాట్‌ఐస్ లేదా హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు చివరి నిమిషం వరకు దానిని గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ప్రాణాలు తీసే ఉచ్చుగా మారిన రోడ్డు
రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టిన సమయంలోనే, కొత్త రహదారి ఎత్తుకు అనుగుణంగా డివైడర్‌ను పునర్నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు కొత్తగా వేయడం అభివృద్ధే కావచ్చు, కానీ భద్రతను విస్మరిస్తే అదే రోడ్డు ప్రాణాలు తీసే ఉచ్చుగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, డివైడర్ ఎత్తు పెంచడంతో పాటు, రాత్రివేళల్లో కనిపించేలా రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

