4 ఎకరాల లోపు రైతులకు ‘భరోసా’
జిల్లావ్యాప్తంగా 2.98 లక్షల మందికి పెట్టుబడి సాయం
బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 255.75 కోట్లు
ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య
కాకతీయ, ఖమ్మం : వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించి 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ‘రైతు భరోసా’ పథకం కింద ఆర్థిక సహాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2,98,513 మంది రైతులకు రూ. 255.75 కోట్లు జమ చేశామని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గాల వారీగా జమ వివరాలు : మధిర: 78,832 మంది రైతులకు రూ. 66.28 కోట్లు, సత్తుపల్లి: 74,682 మంది రైతులకు రూ. 62.19 కోట్లు, పాలేరు: 71,029 మంది రైతులకు రూ. 58.08 కోట్లు, వైరా: 56,673 మంది రైతులకు రూ. 53.78 కోట్లు, ఖమ్మం: 16,197 మంది రైతులకు రూ. 14.69 కోట్లు, ఇల్లందు (కామేపల్లి మండలం): 1,100 మంది రైతులకు రూ. 73 లక్షలు జమ చేసినట్లు తెలిపారు. సాగు ప్రారంభ దశలోనే పెట్టుబడి సాయం అందడంతో వ్యవసాయ పనులు వేగవంతం అవుతాయని వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపారు. రైతులు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అర్హులైన ప్రతి రైతుకూ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

