చేర్యాలలో సమస్యల సుడిగుండం
మున్సిపల్ ఛైర్‌పర్సన్, కమిషనర్ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం
కార్యాలయంలో కరువైన సమయపాలన
గంటల తరబడి వేచి చూస్తున్న ప్రజలు
పట్టణంలో పెరుగుతున్న పారిశుద్ధ్య లోపం
పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, గుంతలమయంగా రోడ్లు
పట్టించుకోని పాలకమండలి.. గట్టెక్కించాలని స్థానికుల విజ్ఞప్తి
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో ప్రజా సమస్యలు రోజురోజుకూ నానాటికీ పెరుగుతున్నాయని పట్టణ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, తాగునీటి సరఫరాలో అంతరాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా లోపించడం వంటి సమస్యలతో స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు పురపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన కరువైందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టి చేర్యాలను సమస్యల నుంచి గట్టెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఛైర్‌పర్సన్, కమిషనర్‌పై విమర్శల జల్లు
పట్టణంలోని మౌలిక సమస్యల పరిష్కారంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్, కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో ఇద్దరూ పూర్తిగా పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలు నెలల తరబడి వేధిస్తున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి వినతిపత్రాలు అందజేసినా స్పందించడం లేదని, ప్రజాసమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కార్యాలయంలో కరువైన సమయపాలన
మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కనీస సమయపాలన పాటించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయం ప్రారంభమైనా కొందరు అధికారులు సీట్లలో కనిపించడం లేదని, ఆలస్యంగా విధులకు హాజరవుతుండటంతో పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపులు, ఇతర పరిపాలనా సేవల కోసం మున్సిపల్ ఆఫీసుకు వచ్చే లబ్ధిదారులు, అధికారుల కోసం ఎదురుచూసి విసిగిపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ కార్యాలయంలో సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.


