- నిజాలను పాతరేసి ‘నో ప్రాపర్టీ’ సర్టిఫికెట్లు జారీ
- 30 ఎకరాల భూస్వామి పేదోడంట
- నో ప్రాపర్టీస్ సర్టిఫికెట్ జారీ చేసిన మాజీ చంద్రుగొండ ఎమ్మార్వో
- వైద్యారోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుతో సదరు వ్యక్తి కొలువు
- రైల్వే పరిహారం పేరుతోనూ లక్షల కొల్లగొట్టిన వైనం
- నో ప్రాపర్టీస్ సర్టిఫికెట్లపై పర్యవేక్షణ లేని ఉన్నతాధికారులు
- ఫలితంగా నిరుపేదలకు దక్కాల్సిన కొలువులు ధనవంతులకు
- రెవెన్యూ శాఖలో చైన్ లింక్‌గా మారిన దొంగ సర్టిఫికెట్ల వ్యవహారం
- నిరుద్యోగుల ఆవేదన.. రెవెన్యూ వ్యవస్థపై సర్వత్రా విమర్శలు
- రంగంలోకి దిగిన ప్రస్తుత తహసీల్దార్.. కలెక్టర్‌కు నివేదిక పంపేందుకు సిద్ధం
కాకతీయ,మణుగూరు/ చండ్రుగొండ : రెవెన్యూ శాఖకు ఉండాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి, అధికార పీఠాల్లో కూర్చున్న అధికారులు ‘సర్టిఫికెట్ల దందా’కు తెరలేపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల రెవెన్యూ కార్యాలయం వేదికగా జరుగుతున్న ఈ అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే, అడిగిన వారికి అడిగినట్లుగా తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపులో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయి. చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో వెలుగుచూసిన తాజా ఘటన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఓ వ్యక్తికి 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ, రెవెన్యూ యంత్రాంగం అదంతా చూసీచూడనట్లు వదిలేసింది. ఏకంగా అతనికి ‘నో ప్రాపర్టీ’ సర్టిఫికెట్ జారీ చేసి, కనీసం సెంటు స్థలం లేని నిరుపేదగా ధ్రువీకరించింది ఆ పత్రంలో పెన్షన్, మూవబుల్, ఇమ్మూవబుల్ ఆస్తులు అన్నీ ‘జీరో’ అని చూపి, అతన్ని పేదవాడిగా చూపించడం గమనార్హం. ఈ ‘అద్భుతమైన’ దొంగ సర్టిఫికెట్‌ను అడ్డుపెట్టుకుని, పట్వారిగూడెంలోని వైద్యారోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఆ వ్యక్తి దక్కించుకున్నాడు.
రెవెన్యూ వ్యవస్థలో ‘చైన్ లింక్’ దందా
కేవలం ఉద్యోగాలే కాకుండా, ఇదే నో ప్రాపర్టీ సర్టిఫికెట్‌ను ఉపయోగించి దక్షిణ మధ్య రైల్వే నుంచి లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఆ వ్యక్తి వసూలు చేశాడని విశ్వసనీయ సమాచారం. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో కొనసాగుతున్న ఒక భారీ ‘చైన్ లింక్’ అని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2013లో కూడా ఇదే తరహాలో తల్లి డెత్ సర్టిఫికెట్‌ను ఫోర్జరీ చేసి వైద్యశాఖలో ఉద్యోగం పొందిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత కూడా ఎలాంటి మార్పు రాకపోవడం, అధికారుల ప్రమేయం లేకుండా ఇలాంటి తప్పుడు పత్రాలు ఎలా తయారవుతాయనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. అర్హులైన పేదలకు దక్కాల్సిన ఫలాలు ఇలా ధనవంతులకు దక్కడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రక్షాళన వైపు జిల్లా కలెక్టర్ చూపు?
ప్రస్తుతం ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెవెన్యూ వ్యవస్థలో వేళ్లూనుకున్న ఈ అవినీతిని తొలగించడానికి ఉన్నత స్థాయి విచారణ ఒక్కటే మార్గమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటే సరిపోదని, ఇన్ని రోజులుగా ఈ అక్రమాలకు మౌనంగా సహకరించిన అధికారుల బాధ్యతను కూడా ఖరారు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. వ్యవస్థను ప్రక్షాళన చేయకుంటే, ఇలాంటి ‘దొంగ’ సర్టిఫికెట్ల దందా మరిన్ని అక్రమాలకు దారితీసే ప్రమాదం ఉందని విద్యావంతులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే సంబంధిత వ్యక్తి ఉద్యోగంపై విచారణ జరిపి, తప్పుడు సర్టిఫికెట్ జారీ చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అప్పుడే రెవెన్యూ శాఖపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని బాధితులు కోరుతున్నారు.
నేను చేయలేదు..గతంలో జరిగింది
: జగదీశ్వర ప్రసాద్, చండ్రుగొండ తహసీల్దార్
“గతంలో ఉన్న ఎమ్మార్వో హయాంలో ఈ సర్టిఫికెట్ జారీ అయిందని మా దృష్టికి వచ్చింది. 30 ఎకరాల భూమి ఉంచుకుని ఏమీ లేదని తప్పుడు ధ్రువీకరణ పత్రం తీసుకున్న వ్యక్తి వ్యవహారం తీవ్రమైనది. దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టాం. ఈ అవకతవకలపై పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్‌కు పంపిస్తాం. తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కార్యాలయానికి వచ్చి ఈ ఫైలుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించాను, త్వరలోనే క్షేత్రస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాను. అంటూ వెల్లడించారు.

