హైకోర్టు ఉత్తర్వుల ధిక్కరణ.. దాడికి పాల్పడ్డ సర్పంచ్
భూమిని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం
పోలీసులకు బాధితురాలు తులసమ్మ ఫిర్యాదు
ప్రాణరక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి
చొప్పదండి మండలంలో కలకలం
కాకతీయ, కరీంనగర్/చొప్పదండి: హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్న భూమిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తూ తనపై, తన కుమారుడిపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చొప్పదండి మండలం కోనేరుపల్లెకు చెందిన కొలపురి తులసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, తమ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.
కోనేరుపల్లె శివారులోని సర్వే నంబర్లు 17, 17/బి/2, 27, 27/ఎ/ఎ, 27/బి, 29, 29/ఏ, 29/బి/ఎ, 32, 32/బి భూములపై తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ, గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు, ఉపసర్పంచ్ అవునూరి తిరుపతి, పంచాయతీ కార్యదర్శి టి. శ్రీనివాస్‌తో పాటు మరికొందరు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని తులసమ్మ ఆరోపించారు. ఈ నెల 13న ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో గడ్డపారలు, పారలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో తన కుమారుడు కొలపురి రాజనర్సయ్య తలకు తీవ్ర గాయమైందని, తన కాలికి కూడా బలమైన గాయాలయ్యాయని తెలిపారు.
నిందితులపై చర్యలకు డిమాండ్
ఈ దాడిలో సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు, ఉపసర్పంచ్ అవునూరి తిరుపతి, మొగిలిపాలెం అంజయ్య, పోరండ్ల చంద్రయ్య, కనుకట్ల నర్సయ్య, బత్తిని ఎల్లయ్య, కనుకట్ల పవన్, గజ్జెల గోపాల్, గూడ రామేశ్వర్ రెడ్డి, కనుకట్ల నాగలక్ష్మి, గజ్జెల శాంతమ్మలతో పాటు మరికొందరు పాల్గొన్నట్లు బాధితురాలు పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు ప్రాణహాని ఉన్నందున పోలీసు రక్షణ కల్పించి న్యాయం చేయాలని తులసమ్మ విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

