ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయం
నగర అభివృద్ధిలో సీపీఎం పాత్ర చిరస్మరణీయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై పోరాడాలి: నున్నా నాగేశ్వరరావు
సుందరయ్య భవనంలో పార్టీ ఖమ్మం డివిజన్ వర్క్‌షాప్
కాకతీయ, ఖమ్మం టౌన్ : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు మరింత చేరువకావడం ద్వారా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం జరిగిన పార్టీ ఖమ్మం డివిజన్ వర్క్‌షాప్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం నగరంలో గతంలో సీపీఎం పాలన సమర్థవంతంగా సాగిందని పోతినేని సుదర్శన్ గుర్తు చేశారు. “చిర్రావూరి లక్ష్మి నర్సయ్య, సమీనా అప్రోజ్ మున్సిపల్ చైర్మన్లుగా ఉన్న కాలంలో త్రాగునీరు, రహదారుల విస్తరణ వంటి మౌలిక సదుపాయాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా కల్పించాం. అప్పటి అభివృద్ధి పునాదులే నేటి నగరానికి దిక్సూచి” అని ఆయన పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తేనే, రాబోయే ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచేందుకు తగిన ప్రణాళికలు సిద్ధమవుతాయని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వాల తీరుపై ధ్వజం
సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు. “మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడిపై ఆర్థిక భారం మోపుతోంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యులు దొంగల తిరుపతిరావు అధ్యక్షత వహించగా, సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, నాయకులు బండారు రమేష్, ఎం.ఎ.జబ్బర్, ఎస్.కె.మీరా సాహిబ్, పి.రమ్య, బోడపట్ల సుదర్శన్, ఎస్.కె.నాగులు మీరా, ఉపేందర్, పి.నాగసులోచన, మాజీ కార్పొరేటర్లు యర్రా గోపి, ఎల్లంపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

