‘సర్’ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే
ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ కాపాడుకోవాలి
కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపు
కరీంనగర్లో ఎన్యుమరేషన్ ఫారం నింపి బీఎల్ఓకు అందజేసిన మంత్రి
జూలై 24లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి
కాకతీయ, కరీంనగర్ : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, అలా చేస్తే ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఓటరు జాబితాలో పేరును సరిచూసుకోవడం, వివరాలను నమోదు చేయడం అనేది ప్రజాస్వామ్య బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా చైతన్యపురిలోని సాధన స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రానికి వెళ్లిన బండి సంజయ్, స్వయంగా ఎన్యుమరేషన్ ఫారాన్ని నింపి బీఎల్ఓకు అందజేశారు. అనంతరం ఆన్లైన్లో కూడా తన వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ పురోగతి, ఎన్యుమరేషన్ దరఖాస్తుల పంపిణీపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూలై 24వ తేదీలోపు ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 50 శాతం మంది మాత్రమే ఫారాలు సమర్పించినట్లు అధికారులు ఆయనకు వివరించారు.
నిర్లక్ష్యం వద్దు.. ఓటును కాపాడుకోండి
ఈ సందర్భంగా బండి సంజయ్ రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. గడువు ముగిసే వరకు వేచి చూడకండి: “జూలై 24 వరకు గడువు ఉంది కదా అని నిర్లక్ష్యం చేయవద్దు. చివరి రోజు కోసం ఎదురుచూడకుండా ఈ రోజే ఎన్యుమరేషన్ ఫారం నింపండి.ష బీఎల్ఓలకు సహకరించండి: “బీఎల్ఓ ఇంటికి వస్తే సహకరించి, ఫారం తీసుకుని వివరాలు సరిచూసి గడువులోగా అందజేయాలి. యువతకు పిలుపు: “సోషల్ మీడియాలో రాజకీయాల గురించి గంటల తరబడి పోస్ట్‌లు పెడతారు, కానీ మీ ఓటు జాబితాలో ఉందో లేదో ఎప్పుడైనా చూసుకున్నారా? ఓటు లేకపోతే మీ ప్రశ్నకు ప్రజాస్వామ్య బలం ఎక్కడిది? ప్రతి యువకుడు తన కుటుంబంలోని ఓట్లు పోకుండా చూసే బాధ్యత తీసుకోవాలి. అముల్యమైన హక్కు: “ఓటు అంటే కేవలం కాగితం ముక్క కాదు.. అది ప్రజల చేతిలో ఉన్న అధికారం, ప్రశ్నించే హక్కుకు బలమంటూ పిలుపునిచ్చారు.
రాజకీయ ఆరోపణలు
సర్ ప్రక్రియ అనేది రాజకీయ కార్యక్రమం కాదని, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమమని బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. “కొన్ని చోట్ల సర్ పేరుతో హిందువుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మజ్లిస్‌తో కుమ్మక్కైన కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తోంది. హిందువులంతా అప్రమత్తంగా ఉండి సర్ ప్రక్రియలో పాల్గొనాలి. లేకపోతే తెలంగాణలో హిందువులు మైనారిటీలయ్యే ప్రమాదం ఉంది” అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. చివరిగా, ప్రతి ఒక్కరూ పది నిమిషాలు కేటాయించి ఎన్యుమరేషన్ ఫారం నింపాలని, లేనిపక్షంలో పోలింగ్ రోజున ‘నా ఓటు ఎక్కడ?’ అని బాధపడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

