చినుకు జాడ లేదు
రైతన్న కళ్లల్లో కన్నీరు
ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌పై నీలినీడలు
ఆశగా ఆకాశం వైపు చూస్తున్న రైతన్నలు
ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారమా?
కాకతీయ,చందుర్తి : ఆషాఢం గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల రైతాంగం ఆందోళనలో మునిగిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయే తప్ప, ఒక్క చినుకు కూడా భూమిని తాకకపోవడంతో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ఎలినో ప్రభావంతో సాధారణ వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలు అన్నదాతను మరింత కలవరపెడుతున్నాయి. పొలాలు దున్ని, విత్తనాలు సిద్ధం చేసుకుని వాన కోసం ఎదురుచూస్తున్న రైతు ఒకవైపు, ఎరువులు, విత్తనాలు నిల్వ ఉంచి అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్న డీలర్లు మరోవైపు, పనులు లేక ఉపాధి కరువైన వ్యవసాయ కూలీలు.. ఇలా మండలంలో అందరి చూపు ఆకాశం వైపే ఉంది. “వాన దేవుడా.. ఒక్కసారైనా వచ్చిపో మా దేవుడా” అంటూ రైతన్న హృదయం ఆవేదనతో మొరపెట్టుకుంటోంది. ఖరీఫ్ సీజన్ గడిచిపోతుండటంతో, సాగు ఎక్కడ ప్రశ్నార్థకంగా మారుతుందోనని రైతులు భయాందోళన చెందుతున్నారు.
ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారమా?
పరిస్థితులపై మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు స్పందిస్తూ రైతులను అప్రమత్తం చేశారు. వర్షాలు మరింత ఆలస్యమైతే అధిక పెట్టుబడి పెట్టే పంటలకు బదులుగా, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగును పరిశీలించాలని ఆయన సూచించారు. ఆరుతడి పంటలు: జొన్న, సజ్జ, కొర్రలు, పెసర, మినుములు, కందులు వంటి పంటలను ఎంచుకోవడం ఉత్తమమని ఆయన తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు నిర్ణయాలు తీసుకోవాలని, పంటల ఎంపికపై సందేహాలు ఉంటే గ్రామాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు.
వ్యవసాయ శాఖపై రైతుల ఆశలు..
ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఈ క్లిష్ట సమయంలో తమకు తోడుగా ఉండాలని రైతులు కోరుతున్నారు. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అందించడంతో పాటు, ప్రత్యామ్నాయ పంటలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి మనోధైర్యం కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. శాస్త్రీయ సాగు పద్ధతులపై నిరంతరం మార్గదర్శకాలు అందించడం ద్వారా, రైతును నష్టాల ఊబి నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు. ప్రకృతి కరుణిస్తేనే ఖరీఫ్ కళకళలాడుతుందని, లేదంటే అన్నదాతకు ఈ ఏడాది కష్టాలు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

