వీర భైరన్పల్లికి కరువైన గుర్తింపు
త్యాగాల గడ్డపై అధికారుల నిర్లక్ష్యం
శిథిలావస్థకు చేరుకుంటున్న స్మారక స్థలాలు!
హామీలను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం
చారిత్రక వారసత్వ పరిరక్షణలో యంత్రాంగం వైఫల్యం!
కాకతీయ, మద్దూర్ : తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో వీర భైరన్పల్లి పేరు చిరస్మరణీయం. నిజాం నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వెరవకుండా వీరోచితంగా పోరాడిన ఆ గ్రామం ఎందరో అమరవీరుల త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. తెలంగాణ పోరాట పటిమను గుర్తుచేసే ప్రతి సందర్భంలోనూ భైరన్పల్లి పేరు సగర్వంగా వినిపిస్తుంది. కానీ, ఆ చారిత్రక గ్రామాన్ని కాపాడాల్సిన అధికార యంత్రాంగం మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండటంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వీర భైరన్పల్లి పేరు పాఠ్యపుస్తకాల్లో, చరిత్ర గ్రంథాల్లో సగర్వంగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అభివృద్ధి కానరావడం లేదు. అమరవీరుల స్మారక స్థలాల సంరక్షణ, చారిత్రక ఆనవాళ్ల పరిరక్షణ వంటి విషయాల్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సందర్శకులకు అవసరమైన కనీస మౌలిక వసతులు లేకపోవడం, చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగితాలకే పరిమితమైన హామీలు
ప్రతి ఏటా అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాన్ని సందర్శించడం, అభివృద్ధి చేస్తామని గొప్పగా హామీలు ఇవ్వడం పరిపాటిగా మారింది. కానీ, ఆ హామీలు సభలతోనే ముగిసిపోతున్నాయి తప్ప, ఆచరణలో మాత్రం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ గ్రామాన్ని రాష్ట్ర స్థాయి వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
సందర్శకులకు కనీస వసతులు లేవు
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, చరిత్ర పరిశోధకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు వీర భైరన్పల్లిని సందర్శిస్తుంటారు. అయితే, వారికి అవసరమైన తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, పార్కింగ్, లేదా పోరాట చరిత్రను కళ్లకు కట్టినట్లు వివరించే సమాచార బోర్డులు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరం. చారిత్రక ప్రదేశానికి వచ్చే సందర్శకులకు కనీస సదుపాయాలు కల్పించలేకపోవడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనం. వీర భైరన్పల్లిని రాష్ట్ర స్థాయి చారిత్రక పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని, అమరవీరుల స్మారక స్థలాలను ఆధునికీకరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక మ్యూజియం, లైట్ అండ్ సౌండ్ షో, పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసి, ప్రతి ఏటా అధికారికంగా ‘తెలంగాణ పోరాట స్ఫూర్తి ఉత్సవాలు’ నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను కేవలం వేదికలపై స్మరించడమే కాకుండా, వారి చరిత్రను శాశ్వతంగా నిలబెట్టేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని మద్దూర్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

