ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే రైతులకు లాభం
వ్యవసాయ విస్తరణ అధికారి సంపత్ వెల్లడి
వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన
స్వల్పకాలిక పంటల వైపు మొగ్గు చూపాలని సూచన
కాకతీయ, కరీంనగర్ /జమ్మికుంట : ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి ఎద్దడిని తట్టుకునే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ విస్తరణ అధికారి సంపత్ సూచించారు. జమ్మికుంట మండలం నగురం గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలిక వరి రకాలకు బదులుగా స్వల్పకాలిక రకాలను సాగు చేయడం వల్ల నీటి వినియోగం తగ్గుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, కందులు వంటి పంటలను సాగు చేయడం ద్వారా వర్షాభావ పరిస్థితులను రైతులు సమర్థంగా ఎదుర్కోవచ్చని వివరించారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే మార్గాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగురం గ్రామ సర్పంచ్ కవ్వంపెల్లి సంపత్, పంచాయతీ కారోబారు స్వామి మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.

