- ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
కాకతీయ, ఖమ్మం టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వరుస ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలను నిరసిస్తూ సీపీఎం 3 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గ్రైన్ మార్కెట్ ప్రజాసంఘాల భవనం నుండి ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వ హయాంలో నీట్ , జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు 12 సార్లు లీకై దేశ యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారని, పేపర్ లీకేజీలకు పాల్పడిన అసలు దోషులను విచారించకుండా ప్రభుత్వం వారితో కుమ్మక్కై కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పౌర హక్కుల నేత వాంగు చెంగు గత 20 రోజులుగా ఆమర నిరాహార దీక్ష చేస్తుంటే, ప్రభుత్వం ఆయనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు వై. విక్రమ్, ఎర్ర శ్రీనివాసరావు, 3 టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు, బండారు వీరబాబు, ఎస్కే సైదులు, ఎస్కే ఇమామ్, పి. జార్జి, ఎస్.కె మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

