- జిల్లా యూత్ పార్లమెంట్ నిర్వహించాలి
- యువతను విస్తృతంగా భాగస్వాములను చేయాలి
- ప్రతిభావంతులను గుర్తించి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయాలి
- ప్రతి నెల కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించాలి
- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ
కాకతీయ, మయూరి సెంటర్ : కేంద్ర ప్రభుత్వం యువత కోసం ప్రారంభించిన మై భారత్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా యువజన కార్యక్రమాల సలహా సంఘం సమావేశంలో ఆమె అధికారులతో సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మై భారత్ పోర్టల్ ద్వారా యువతకు వివిధ రంగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 14 వేల మంది యువత మాత్రమే ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని, ప్రత్యేక నమోదు కార్యక్రమం ద్వారా ఈ సంఖ్యను భారీగా పెంచాలని సూచించారు. జిల్లాలోని ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్ కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలను సందర్శించి ప్రతి విద్యార్థిని మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయించాలని ఆదేశించారు. అలాగే ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ప్రత్యేక పోటీలు – అవకాశాలు
జిల్లా స్థాయిలో యూత్ పార్లమెంట్ నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయికి పంపాలని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన యువతకు భారత పార్లమెంట్‌లో పాల్గొనే సువర్ణ అవకాశం లభిస్తుందని తెలిపారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో నిర్వహించే క్విజ్ పోటీల్లో విజేతలకు దేశ సరిహద్దు రాష్ట్రాల పర్యటన అవకాశం లభిస్తుందని, కొన్ని కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారికి గౌరవనీయులైన ప్రధాన మంత్రిని కలిసే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాలపై యువతలో విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా వ్యాసరచన, చిత్రలేఖనం తదితర ఎనిమిది రకాల పోటీలను జిల్లాలో నిర్వహించాలని సూచించారు. జిల్లా స్థాయిలో విజేతలకు కేంద్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
నెలవారీ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు
యువతకు భవిష్యత్ కెరీర్‌పై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ప్రతి నెల చివరి ఆదివారాల్లో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్య, వివిధ ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ అవకాశాలు, రక్షణ రంగం మరియు ఇతర వృత్తి రంగాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. కెరీర్ గైడెన్స్ కార్యక్రమాల సమర్థ నిర్వహణ కోసం సంబంధిత శాఖలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అవసరమైన అధ్యయన సామగ్రి, పరీక్షల విధానం, కెరీర్ మార్గదర్శక సమాచారాన్ని సిద్ధం చేసి విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ వెంకట్రామ్ బాబు, జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి. జ్యోతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎ. రవిప్రసాద్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు, జిల్లా విద్యాధికారి, జిల్లా యువజన క్రీడల అధికారి టి. సునీల్ రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ రావు, అడిషనల్ డీఎంహెచ్‌ఓ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

