- యూడీఎఫ్ టెండర్లపై ఆరోపణలు నిరాధారం రవీందర్ సింగ్‌కు సునీల్‌రావు కౌంటర్
- గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఎక్సెస్ టెండర్లపై సమాధానం చెప్పాలని డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : యూడీఎఫ్ (యూనిఫైడ్ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్) టెండర్ల పేరిట కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు మండిపడ్డారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, లేదంటే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.శుక్రవారం కరీంనగర్‌లోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూడీఎఫ్ పథకం కింద రూ.180 కోట్లకు పరిపాలనా అనుమతి లభించినప్పటికీ, ఈసీవీ విలువ రూ.137 కోట్లేనని తెలిపారు. పనులు కూడా అదే విలువ మేరకు జరుగుతున్నాయని, అలాంటప్పుడు రూ.30 నుంచి రూ.40 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని అన్నారు.
టెండర్ల ఆమోదం రాష్ట్ర ప్రభుత్వానిదే
యూడీఎఫ్ టెండర్ల ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతుందని, టెండర్లకు ఆమోదం తెలిపేది రాష్ట్ర ప్రభుత్వమేనని సునీల్‌రావు స్పష్టం చేశారు. అలాంటి ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపిస్తే దానికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసిన రవీందర్ సింగ్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత ప్రభుత్వ టెండర్లపై సమాధానం చెప్పాలి
ఎక్సెస్ టెండర్లపై మాట్లాడుతున్న రవీందర్ సింగ్ ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్ల గురించి సమాధానం చెప్పాలని సునీల్‌రావు ప్రశ్నించారు. గత పదేళ్లలో వేల కోట్ల రూపాయల విలువైన పనులు అదే నిర్మాణ సంస్థలకు అప్పగించారని, అప్పట్లో ఎక్సెస్ టెండర్లపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.మిడ్ మానేరు, గౌరవెల్లి, తోటపల్లి, మల్లన్నసాగర్, భక్తరామదాసు వంటి ప్రధాన ప్రాజెక్టులను కూడా ఇదే సంస్థ నిర్మించిందని గుర్తు చేశారు. ఆ పనులకు అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చిన విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు.
స్మార్ట్‌సిటీ టెండర్లపై నిలదీత
కరీంనగర్లో రూ.546 కోట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో కూడా నాలుగు శాతం ఎక్సెస్ టెండర్ ఉందని, అది ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు కూడా ఇదే సంస్థకు అప్పగించారని పేర్కొన్నారు.ఎక్సెస్ టెండర్లు అనేవి ప్రభుత్వ సాంకేతిక నిర్ణయాల్లో భాగమని, వాటిని అవినీతిగా చిత్రీకరించడం రాజకీయ దురుద్దేశమేనని విమర్శించారు.
బండి సంజయ్‌కు టెండర్లతో సంబంధం లేదు
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపులతో ఎలాంటి సంబంధం లేదని సునీల్‌రావు స్పష్టం చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం యూసీఎఫ్ పథకం కింద రూ.840 కోట్ల నిధులు తీసుకురావడమే బండి సంజయ్ కృషికి నిదర్శనమని అన్నారు.అవసరమైతే యూడీఎఫ్ టెండర్లపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని, కానీ ఆధారాలు లేకుండా బండి సంజయ్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.విలేకరుల సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు వొంటెల సత్యనారాయణ రెడ్డి, వంగల పవన్, బండారి వేణు, కొలిపాక శ్రీనివాస్, పొన్నం మొండయ్యతో పాటు పార్టీ నాయకులు పండుగ నాగరాజు, వాసు, భాస్కర్, హమీద్, రాజ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయంగా వేడెక్కిన టెండర్ వివాదం
రూ.180 కోట్ల యూడీజీ టెండర్‌పై మాజీ మేయర్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలు, వాటికి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఇచ్చిన ఘాటు కౌంటర్‌తో కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు టెండర్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని రవీందర్ సింగ్ డిమాండ్ చేస్తుండగా, మరోవైపు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సునీల్ రావు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో యూడీజీ టెండర్ వివాదం రానున్న రోజుల్లో మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

