జాతీయ యోగా పోటీల్లో తెలంగాణ జయభేరి!
రెండు స్వర్ణాలు.. ఒక కాంస్యంతో మెరిసిన భూక్య చైత్రహాసిని
తెలంగాణ జట్టు కెప్టెన్‌గా ఘన విజయం
కాకతీయ, చందుర్తి: మారుమూల గిరిజన తాండా నుంచి జాతీయ స్థాయి వేదికపై సత్తా చాటింది భూక్య చైత్రహాసిని. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల దేవునితాండాకు చెందిన భూక్య అగన్‌లాల్ కుమార్తె చైత్రహాసిని జాతీయ యోగా పోటీల్లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన జాతీయ స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌లో 12 మందితో కూడిన తెలంగాణ జట్టుకు చైత్రహాసిని కెప్టెన్‌గా వ్యవహరించింది. వ్యక్తిగత విభాగంలో రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించి ప్రతిభ చాటింది. ఆమె విజయంపై దేవునితాండా గ్రామస్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వమే కారణమని చైత్రహాసిని తెలిపింది. భవిష్యత్తులో అంతర్జాతీయ యోగా పోటీల్లో పతకాలు సాధించి దేశానికి, తెలంగాణకు పేరు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొంది.

