సీతారామ లింక్ కెనాల్ పనుల్లో నాణ్యత డొల్ల!
అధికారుల పర్యవేక్షణ లేకుండానే మరమ్మతులు
సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
కాకతీయ, ఏన్కూరు: కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పనుల్లో నాణ్యత లోపాలు వెలుగుచూస్తున్నాయని సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. వినోబానగర్ నుంచి ఏన్కూరు ఎన్‌ఎస్‌పీ కెనాల్ వరకు నిర్మించిన కాలువలో నిర్మాణం పూర్తయిన కొన్ని నెలలకే సీసీ లైనింగ్ పెచ్చులు ఊడిపోవడం, పలుచోట్ల పగుళ్లు ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. శుక్రవారం సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, ఏన్కూరు మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులతో కలిసి లింక్ కెనాల్‌ను పరిశీలించారు. కాలువలో పలుచోట్ల సీసీ లైనింగ్ దెబ్బతిన్న తీరును పరిశీలించారు. కాంక్రీట్ పెచ్చులు ఊడిపోవడంతో పాటు పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను గుర్తించారు.
కాలువ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని భూక్యా వీరభద్రం ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన పనులు పూర్తయిన కొద్దికాలానికే దెబ్బతినడం అధికారుల, కాంట్రాక్టర్ల పనితీరుకు నిదర్శనమన్నారు. నాణ్యతా లోపాలు బయటపడిన తర్వాత వాటిని కప్పిపుచ్చేందుకు హడావుడిగా మరమ్మతులు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లేకుండా కాంక్రీట్ లారీలతో వచ్చి మరమ్మతులు చేపట్టడం సరికాదన్నారు. ముందుగా కాలువ నిర్మాణ నాణ్యతపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికారుల సమక్షంలోనే మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు.
పనులను అడ్డుకున్న నాయకులు
ఇరిగేషన్, ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకుండానే మరమ్మతులు ఎలా చేపడతారని నాయకులు ప్రశ్నించారు. సంబంధిత అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు స్పందించలేదని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించే వరకు పనులు కొనసాగించడానికి వీల్లేదని హెచ్చరిస్తూ మరమ్మతులను అడ్డుకున్నారు.
క్వాలిటీ కంట్రోల్‌కు ఫిర్యాదు
: సీపీఐ(ఎం) ఏన్కూరు మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు
సీతారామ లింక్ కెనాల్ పనులపై క్వాలిటీ కంట్రోల్ విభాగానికి, ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు దొంతబోయిన నాగేశ్వరరావు తెలిపారు. కాలువ నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రి, కాంక్రీట్ నాణ్యత, పనుల పర్యవేక్షణ తదితర అంశాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు. నాణ్యత లోపాలకు కారణమైన అధికారులతో పాటు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాధనంతో చేపట్టిన ప్రాజెక్టు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు. విచారణ పూర్తయ్యే వరకు మరమ్మతులు నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భూక్యా లక్ష్మా, నండూరి శ్రీను, సీపీఐ(ఎం) నాయకులు, స్థానిక రైతులు నరసింహారావు, రాములు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

