రోడ్డు ప్రమాదంలో నలుగురికి చేరిన మృతుల సంఖ్య
ఒకే కుటుంబాన్ని కబళించిన మృత్యువు
ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు.. చికిత్స పొందుతూ నలుగురు మృతి
రుద్రంగిలో విషాదఛాయలు.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట శివారులోని పెద్దమ్మ ఆలయం సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. రుద్రంగికి చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు వివాహ వేడుకకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందడంతో రుద్రంగిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షాదుల్లా, ఆయన భార్య హసీనా శనివారం రాత్రే మృతి చెందారు. అనంతరం మరో హసీనా ఆదివారం రాత్రి, పదో తరగతి చదువుతున్న రిమ్సా సోమవారం ఉదయం మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సోమవారం వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రోడ్డు భద్రతా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, అతివేగానికి దూరంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తిక్ బాధిత కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే కూడా మృతుల కుటుంబాలను పరామర్శించారు.

