వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ఆటో కార్మికులకు రూ.12 వేల సాయం ఏమైంది?
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కాకతీయ, శంకరపట్నం : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ ఏమైంది?
ఆటో రిక్షా కార్మికుడు గొడిశాల సదానందం మాట్లాడుతూ ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గి ఆదాయం పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

