ప్రత్యామ్నాయ పంటలతో అభివృద్ధి వైపు రైతు అడుగులు
బంతిపూల సాగుతో రైతుకు మంచి ఆదాయం
వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి
ఆయిల్‌పామ్‌తో 25–30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
కాకతీయ, గంభీరావుపేట : ప్రత్యామ్నాయ పంటల సాగు రైతుల అభివృద్ధికి బాటలు వేస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. మంగళవారం గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో క్షేత్రస్థాయిలో సాగు చేస్తున్న ప్రత్యామ్నాయ పంటలను ఆమె పరిశీలించారు. గజసింగవరం గ్రామానికి చెందిన రైతు బోయిని మల్లేశం తనకున్న మూడున్నర ఎకరాల్లో రెండు ఎకరాల్లో జూలైలో బంతిపూల సాగు చేపట్టారు. నాటిన 65 రోజుల నుంచి పూల కోత ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుందని కలెక్టర్ తెలుసుకున్నారు. ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి పూలను కోయవచ్చని రైతు వివరించారు. ఎకరానికి 45 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని, కిలో బంతిపూలకు సుమారు రూ.60 ధర లభిస్తోందని మల్లేశం తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు 50 శాతం రాయితీ లేదా ఎకరానికి రూ.8 వేల చొప్పున గరిష్ఠంగా ఐదు ఎకరాల వరకు సబ్సిడీ అందుతోందని వివరించారు. దసరా, దీపావళి తదితర పండుగలు, శుభకార్యాల సమయంలో పూలకు డిమాండ్ పెరగడంతో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా రైతు మల్లేశంను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతిపూల సాగు చేపట్టి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఇతర రైతులు కూడా మల్లేశంను ఆదర్శంగా తీసుకుని ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు.
ఆయిల్‌పామ్‌తో దీర్ఘకాలిక ఆదాయం
రైతులు సంప్రదాయ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. జిల్లావ్యాప్తంగా 17 వేల ఎకరాల్లో కూరగాయలు, పూల మొక్కల సాగుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో 1,250 ఎకరాల్లో కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల సాగు జరుగుతోందని వివరించారు. వీటి ద్వారా రైతులకు నిరంతర ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో 25 నుంచి 30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టారని చెప్పారు. మొదటి మూడేళ్లలో అంతర పంటలు సాగు చేసుకుంటూ అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో రైతులను కలిసి సాగు విధానాలు, దిగుబడి, లాభాలపై వివరాలు తెలుసుకుంటూ రైతులకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, గంభీరావుపేట ఎంపీడీవో రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

