వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి..
నీటి వనరులను సంరక్షిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి : అదనపు కలెక్టర్ రవి..
కాకతీయ, హసన్‌పర్తి :
రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి సూచించారు. వ్యవసాయ భూముల సంరక్షణ, భూసార పరిరక్షణ, నీటి వనరుల పొదుపుతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి అనురాధ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ సందరాజు లావణ్య అధ్యక్షతన నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని నేల స్వభావానికి అనుగుణంగా సమతుల్య ఎరువులు వినియోగించాలని సూచించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల మార్పిడి, చీడపీడల నివారణపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల, విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. పంట కొయ్యలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నాలని, వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రకృతి వనరులను కాపాడుతూ భవిష్యత్ తరాలకు సారవంతమైన భూమిని అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నీటి లభ్యతను బట్టి ఆయిల్‌పామ్, కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశెనగ, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, అలసంద, జొన్న తదితర పంటలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఆది రెడ్డి, టీకేవీకే శాస్త్రవేత్త నర్సయ్య, డీఎం టీజీ ఆయిల్‌ఫెడ్ శంకర్, మండల వ్యవసాయ అధికారి అనురాధ, ఏఈ తరుణ్, వీఏఎస్‌లు దీపిక, రమేష్, ఆత్మకూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగళ్లపెల్లి తిరుపతి, సర్పంచ్ సందరాజు లావణ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు శైలజ, సాయి, స్థానిక రైతులు పాల్గొన్నారు.


