గిరిజన సంక్షేమ శాఖలో రెగ్యులర్ స్కాం
కాంట్రాక్ట్ ఉద్యోగులకు యూనియన్ నేతల వసూళ్లు
ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామంటూ ఆశ చూపిన నేతలు
350 మంది నుంచి రూ.కోటి 80లక్షల వరకు వసూళ్లు
మూడేళ్లయినా క్రమబద్ధీకరణ లేదు.. డబ్బులూ తిరిగి ఇవ్వలేదు
ఒక్కొక్కరి నుంచి రూ.40 వేలు వసూలు చేశారంటూ బాధితుల ఆరోపణ
ఐదు నెలల క్రితమే ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
రాష్ట్ర డీజీపీ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకూ వినతిపత్రం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామంటూ యూనియన్ నాయకులు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2023లో ఉద్యోగులకు ఆశ చూపి హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. అనంతరం కోర్టులో కేసు వేశామంటూ మరో రూ.5 వేల చొప్పున తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 మంది ఉద్యోగుల నుంచి రూ.1.80 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు క్రమబద్ధీకరణ కాలేదు. చెల్లించిన డబ్బులూ తిరిగి అందలేదు. డబ్బులు అడిగితే బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఐదు నెలల క్రితమే ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర డీజీపీ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు వినతిపత్రాలు సమర్పించారు.

క్రమబద్ధీకరణ హామీతో వసూళ్లు
గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2002 నుంచి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న భోజనేతర ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని టీజీ టీఆర్ఈఐఎన్‌టీఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి బానోత్ కృష్ణసాగర్ నమ్మబలికారని బాధితులు వినతిపత్రంలో పేర్కొన్నారు. 2023లో హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసి కేటగిరీల వారీగా ఒక్కో ఉద్యోగి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఆ తర్వాత కేసు వేశామని చెప్పి మరోసారి రూ.5 వేల చొప్పున తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయి సంఘం ప్రతినిధుల ద్వారా ఈ వసూళ్లు జరిగినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 మంది నుంచి రూ.1.80 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితుల ఆరోపణ.

ఏటూరునాగారంలో పోలీసులను కలిసిన అనంతరం బాధిత కాంట్రాక్టు ఉద్యోగులు
అప్పులు చేసి చెల్లించినా.. ఫలితం శూన్యం
ఉద్యోగాలు క్రమబద్ధీకరణ అవుతాయన్న ఆశతో కొందరు అప్పులు చేయగా, మరికొందరు పుస్తెల తాళ్లు తాకట్టు పెట్టి, భూములు అమ్మి డబ్బులు చెల్లించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం పరిధిలోని మూడు గురుకులాలకు చెందిన సుమారు 15 మంది ఉద్యోగులు ఈ వ్యవహారంలో బాధితులుగా ఉన్నట్లు చెబుతున్నారు. చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా స్పందన లేదని వాపోతున్నారు. సంబంధిత కార్యాలయ అధికారులతోపాటు సంఘం రాష్ట్రస్థాయి నాయకులను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఉద్యోగం క్రమబద్ధీకరణ కాకపోగా, సొమ్ము కూడా తిరిగి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు గడువులు పెడుతూ కాలయాపన చేశారని బాధితుడు వట్టం జగ్గ తెలిపారు. చివరకు అడిగితే డబ్బులు ఇవ్వడం కుదరదని, ఏం చేసుకుంటారో చేసుకోండని చెప్పారని ఆరోపించారు. పార్ట్‌టైం ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించడంతోపాటు పోలీసులను పిలిపించి తమను బయటకు పంపించారని పేర్కొన్నారు. ఉద్యోగం పోతుందనే భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నామని, సమస్య పరిష్కారం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు.

పోలీసులకు ఫిర్యాదు.. ఉన్నతాధికారులకు వినతి
బాధితులు ఐదు నెలల క్రితమే ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీకి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కూడా వినతిపత్రాలు పంపించారు. మే 28, 2026న ఎమ్మెల్సీకి సమర్పించిన వినతిపత్రంలో డబ్బుల వసూళ్లు, సంఘం నాయకుల పాత్ర, ఉద్యోగుల సమస్యలను వివరించారు. తాజాగా బుధవారం మరోసారి ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐని కలిసి న్యాయం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు రఘును పిలిపించి చర్చించినట్లు బాధితుడు వట్టం జగ్గ వెల్లడించారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి, సంబంధిత శాఖకు మాత్రమే ఉంటుంది. అలాంటి హామీతో ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల నుంచి తీసుకున్న సొమ్ము ఎక్కడికి వెళ్లింది? వసూళ్లలో ఎవరెవరి పాత్ర ఉంది? బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఏ చర్యలు తీసుకుంటారు? అనే అంశాలను తేల్చాలని బాధితులు కోరుతున్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో జరిగినట్లు చెబుతున్న వసూళ్లపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

