కలెక్టర్ మేడమ్ ఆలోచించండి..!!
ఏనుమాములలో మార్కెటింగ్ అధికారులకు ఏదీ భరోసా..?
నోటీసుల జారీపై వ్యాపారుల ఆగ్రహం.. కొనుగోళ్ల నిలిపివేతతో ఒత్తిడి
వ్యాపారులు తప్పు చేసినా తప్పేం కాదా..?
విధుల్లో ఉన్న అధికారిని దూషిస్తే వ్యక్తిగత అంశం ఎలా అవుతుంది..?
వ్యాపారులతో కలెక్టర్ సమావేశంలో అధికారిపై వ్యాపారి దుర్భాషలాడిన అంశం సైడ్ ట్రాక్
అక్రమాలను బయటపెట్టినందుకు అధికారిని టార్గెట్ చేస్తారా..?
ఇక నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులకు ఏదీ సపోర్ట్..?
కలెక్టర్ సత్యశారద యంత్రాంగానికి ఏం సందేశం ఇస్తున్నట్టు..?
రైతులకు ఇబ్బంది కలగొద్దనే కలెక్టర్ ప్రయత్నం అభినందనీయం.. మరి అక్రమాలపై కఠిన వైఖరి ఏదీ..?
ప్రభుత్వ విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి నోటీసులు జారీ చేసిన అధికారులే చివరకు వివాదంలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో కనిపిస్తోంది. మార్కెట్‌లో తనిఖీల అనంతరం వ్యాపారులకు నోటీసులు ఇవ్వడంతో మొదలైన వివాదం.. జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్‌తో వాగ్వాదం, వ్యాపారి లింగారెడ్డిపై పోలీసు కేసు, చివరకు పత్తి కొనుగోళ్ల నిలిపివేత వరకు వెళ్లింది. వ్యాపార వర్గాలు కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సెలవు రోజైన ఆదివారం వ్యాపార వర్గాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వివాదాన్ని పెద్దది చేయవద్దని సూచించారు. రికార్డుల తనిఖీ, నిబంధనల ఉల్లంఘనలపై నోటీసుల జారీ సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ జోక్యం చేసుకోవడం అభినందనీయమే. అయితే ఈ సమావేశంలో అధికారిపై జరిగిన వాగ్వాదం, దూషణలు, విధుల నిర్వహణకు ఆటంకం కలిగించిన అంశానికి తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు ముందుకు వస్తున్నప్పుడు, మరోవైపు నిబంధనల అమలు కోసం పనిచేసిన అధికారులకు భరోసా కల్పించే బాధ్యతను కూడా విస్మరించకూడదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఆదివారం వరంగల్ ఎనుమాముల మార్కెట్ అడ్తి వ్యాపారులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
తనిఖీలతో మొదలైన వివాదం.. నోటీసులతో వ్యాపారుల అసంతృప్తి
ఏనుమాముల మార్కెట్‌లో ప్రభుత్వం నియమించిన లక్ష్మణుడి బృందం ఈ నెల 4, 5 తేదీల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. తూకాల్లో వ్యత్యాసాలు, హమాలీ ఛార్జీల వసూళ్లు, ఈ-నామ్ నమోదు, వేబ్రిడ్జి వినియోగం తదితర అంశాలను పరిశీలించింది. ఈ తనిఖీల ఆధారంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ నెల 10న పలువురు వ్యాపారులకు నోటీసులు జారీ చేసింది. తూకాల్లో తేడాలు, హమాలీ పని చేయకుండానే అదనపు వసూళ్లు, ఈ-నామ్‌లో నమోదు లేకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించడం వంటి అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది. గన్నీ బ్యాగుల ఛార్జీలపై అడ్డీ కమిషన్ వసూలు, లూజ్ వాహనాల్లో వచ్చిన సరుకుకు హమాలీ ఛార్జీలు, మిర్చి బస్తాల బరువులో కటింగ్, మార్కెట్ యార్డుకు రాని సరుకుకు తక్కపట్టీ జారీ వంటి ఇతర అంశాలపైనా పరిశీలన జరిగింది. ఇవన్నీ మార్కెట్ వ్యవహారాల్లో నిబంధనల అమలుకు సంబంధించిన అంశాలే. తనిఖీల్లో గుర్తించిన విషయాలపై వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వడం అధికారుల విధుల్లో భాగం. నోటీసులు అందుకున్న వ్యాపారులకు తమ వాదన వినిపించే అవకాశం ఉంటుంది. వాటిపై అభ్యంతరాలుంటే సంబంధిత ఉన్నతాధికారులను ఆశ్రయించవచ్చు. కానీ తనిఖీల అనంతరం నోటీసులు జారీ చేయడమే వివాదానికి కారణమై, అధికారులు బహిరంగంగా వ్యాపారుల ఆగ్రహానికి గురికావాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది.

విధుల్లో ఉన్న అధికారిని దూషిస్తే వ్యక్తిగత అంశమా..?
పత్తి బీట్ వద్ద జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజుతో వ్యాపారి లింగారెడ్డి వాగ్వాదానికి దిగిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మార్కెట్‌కు ఎవరైనా రావచ్చని, తనిఖీలను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని డీఎంఓ స్పష్టం చేయగా, బీట్ నిర్వహణపై లింగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వీడియోలో ఉంది. అనంతరం మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్‌తోనూ నోటీసుల జారీ అంశంపై వాగ్వాదం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో లింగారెడ్డిపై ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక్కడ గమనించాల్సిన అంశం అధికారి, వ్యాపారి మధ్య వ్యక్తిగతంగా ఏదైనా విభేదం తలెత్తిందా అన్నది కాదు. ప్రభుత్వ అధికారి తన విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు వాటిని అడ్డుకోవడం, బహిరంగంగా కించపరిచేలా మాట్లాడటం వంటి వ్యవహారాలను ఎలా పరిగణించాలన్నదే అసలు ప్రశ్న. అధికారి విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్న హోదా, బాధ్యతలను పక్కనపెట్టి జరిగిన వాగ్వాదాన్ని వ్యక్తిగత వ్యవహారంగా మాత్రమే చూడటం ఎంత వరకు కరెక్ట్ అన్న అసంతృప్తి వైఖరి ఇటు అధికార, అటు రైతాంగంలో వ్యక్తమవుతోంది. వ్యాపారులకు తమ అభ్యంతరాలు చెప్పుకునే హక్కు ఉన్నట్లే, అధికారులకు చట్టబద్ధంగా విధులు నిర్వహించే హక్కు కూడా ఉంది. ఒక అధికారి తీసుకున్న నిర్ణయం తప్పని భావిస్తే దాన్ని చట్టబద్ధంగా ప్రశ్నించాలి. కానీ విధులు నిర్వహిస్తున్న అధికారిని దూషించడం, ఆయన పనికి ఆటంకం కలిగించడం సమర్థించదగిన చర్య కాదు.
కొనుగోళ్ల బంద్‌తో ఒత్తిడి.. రైతులే సమిధలా..?
లింగారెడ్డిపై కేసు నమోదు కావడంతో వ్యాపార వర్గాలు నిరసనకు దిగాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించడంతో శనివారం మార్కెట్‌లో పత్తి క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సోమవారం కూడా బంద్ కొనసాగించాలా అన్న అంశంపై వ్యాపారులు చర్చించారు. అధికారులు నిబంధనల అమలులో భాగంగా తనిఖీలు నిర్వహించి నోటీసులు జారీ చేస్తే, వాటిపై అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రభావం మాత్రం మార్కెట్‌కు సరుకు తీసుకొచ్చిన రైతులపై పడింది. పత్తి అమ్ముకునేందుకు వచ్చిన రైతులు కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యాపారుల సమస్యలు వినడం, వారి అభ్యంతరాలను పరిష్కరించడం అవసరమే. అయితే ఆ వివాదానికి రైతులను ఇబ్బందుల్లోకి నెట్టే రూపం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నది ప్రశ్న. నోటీసులపై వివరణ ఇవ్వడం, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి మార్గాలు ఉండగా కొనుగోళ్లు నిలిపివేయడం ద్వారా అధికారులపై ఒత్తిడి పెంచే పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తిపై నమోదైన కేసును వ్యాపార వర్గాల సమిష్టి సమస్యగా చూపిస్తూ కొనుగోళ్లు నిలిపివేస్తే, మార్కెట్ నిబంధనల అమలుకు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది ఆలోచించాల్సిన అంశం.
కలెక్టర్ జోక్యం మంచిదే.. అధికారులకు భరోసా ఏదీ..?
వివాదం మరింత ముదరకుండా, రైతులకు కొనుగోళ్లలో అంతరాయం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం వ్యాపార వర్గాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మార్కెట్ అధికారులు, వ్యాపారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నిబంధనల అమలులో భాగంగా రికార్డులు తనిఖీ చేయడంలో తప్పులేదని, ఉల్లంఘనలు గుర్తించినప్పుడు నోటీసులు ఇవ్వడం సాధారణ పరిపాలనా ప్రక్రియేనని స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు రికార్డులు చూపించడానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. రైతులు నష్టపోకుండా, వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా వ్యవహరించాలని వ్యాపారులకు సూచించారు. ఈ జోక్యం వల్ల కొనుగోళ్ల బంద్ ప్రభావం తగ్గి రైతులకు ఊరట లభించడం మంచి పరిణామం. అయితే సమావేశంలో ప్రధానంగా రైతులకు ఇబ్బందులు కలగకూడదన్న అంశంపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వ్యవహారం, బహిరంగంగా జరిగిన వాగ్వాదం, దూషణల అంశాలపై కూడా స్పష్టమైన వైఖరి అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోటీసుల జారీ తప్పు కాదని కలెక్టర్ స్వయంగా స్పష్టం చేసినప్పుడు, ఆ నోటీసులు ఇచ్చిన అధికారిపై జరిగిన వ్యవహారాన్ని కూడా పరిపాలనా కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. వ్యాపారుల వాదనను వినడం ఎంత ముఖ్యమో, అధికారుల ఆత్మగౌరవం, విధి నిర్వహణకు భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యం.
నిక్కచ్చిగా పనిచేసే అధికారులకు అండ ఎక్కడ..?
ఏనుమాముల మార్కెట్ వ్యవహారం ఒక వ్యాపారి, ఒక అధికారి మధ్య జరిగిన వాగ్వాదానికి మాత్రమే పరిమితం కాదు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అధికారులు నిబంధనల ప్రకారం పనిచేసే సమయంలో వ్యాపార, రాజకీయ లేదా ఇతర వర్గాల నుంచి ఒత్తిళ్లు ఎదురైతే ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నదానికి ఇది ఒక ఉదాహరణగా మారుతోంది. మార్కెట్‌లో అక్రమాలు ఉన్నట్లు తనిఖీల్లో గుర్తిస్తే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. ఆ చర్యలను ప్రశ్నించే హక్కు వ్యాపారులకు ఉన్నప్పటికీ, అధికారుల విధులకు ఆటంకం కలిగించే హక్కు ఎవరికీ లేదు. నోటీసులు ఇచ్చినందుకు కొనుగోళ్లు నిలిపివేస్తే, తనిఖీలు నిర్వహించినందుకు అధికారులను లక్ష్యంగా చేసుకుంటే.. రేపు మరో అధికారి ఇలాంటి అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకునేందుకు ముందుకు వస్తారా అన్న సందేహం సహజంగానే తలెత్తుతుంది. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడటం కలెక్టర్ బాధ్యత. అదే సమయంలో విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులకు అండగా నిలవడం కూడా ఉన్నతాధికారుల బాధ్యతే. వ్యాపారుల అభ్యంతరాలను చట్టబద్ధంగా పరిష్కరించడంతోపాటు, అధికారుల విధులకు రక్షణ కల్పించే విషయంలో స్పష్టమైన సందేశం వెళ్లాలి. లేకపోతే నిబంధనల అమలు కంటే ఒత్తిళ్లను ఎదుర్కోవడమే అధికారులకు ప్రధాన సవాలుగా మారే ప్రమాదం ఉంది. ఏనుమాముల మార్కెట్‌లో రైతుల ప్రయోజనాలు, వ్యాపారుల అభ్యంతరాలు, అధికారుల విధి నిర్వహణ.. ఈ మూడింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చేలా యంత్రాంగం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్రమాలను గుర్తించి నోటీసులు ఇచ్చిన అధికారికి భరోసా కల్పించకుండా, కొనుగోళ్లు నిలిపివేస్తామని హెచ్చరించిన వ్యాపారులకే సముదాయింపులు పరిమితమైతే క్షేత్రస్థాయి అధికారులకు ఎలాంటి సందేశం వెళ్తుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
ఎడిటర్
అరెల్లి కిరణ్ గౌడ్
-7396604266

