నేడు రుద్రంగి పీఎస్ నూతన భవనానికి శంకుస్థాపన
హాజరుకానున్న డీజీపీ శివధర్ రెడ్డి
కాకతీయ, వేములవాడ: రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పోలీసు స్టేషన్ భవనానికి శుక్రవారం శంకుస్థాపన జరగనుంది. ఈ వేడుకకు సంబంధించి జరిగిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్వయంగా పరిశీలించారు. శంకుస్థాపన సజావుగా సాగేలా అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారని ఎస్పీ వెల్లడించారు. అత్యాధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించడం ద్వారా పోలీసు సిబ్బందికి మౌలిక వసతులు మెరుగుపడతాయని, తద్వారా ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ శ్రీనివాసులు, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రమేష్, ఎస్సైలు మోతీరాం, రమేష్, యాదగిరి, పోలీస్ హౌసింగ్ బోర్డు ఏఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

