రైతు సంక్షేమమే లక్ష్యం..
చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం
రైతును రాజుగా నిలబెట్టడమే కాంగ్రెస్ ధ్యేయం
సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ రూరల్ : రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీనగర్, ఫకీర్‌పేట్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని, ‘తాలు’ పేరుతో రైతులను అనేక ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని తెలిపారు. రైతును నిజమైన రాజుగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రామ్మోహన్, సీసీలు కృష్ణ, అశోక్, పీఏసీఎస్ సీఈఓ రమేష్, సర్పంచులు సుద్దాల కమలాకర్, బొద్దుల విజయలక్ష్మి, లక్ష్మణ్, వీవో సునీత మరియు రైతులు పాల్గొన్నారు.

