విజయ డెయిరీ నమూనాలో ‘ఇందిరా మహిళా డెయిరీ’
రోజుకు 80 వేల లీటర్ల పాల సేకరణే లక్ష్యం
40 వేల మందికి పాడి పశువుల పంపిణీ
సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర
కాకతీయ, మయూరి సెంటర్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరా మహిళా డెయిరీ’ని విజయవంతం చేసేందుకు విజయ డెయిరీ నమూనాను అనుసరిస్తూ సమగ్ర ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం విజయ డెయిరీ ద్వారా రోజుకు 6 వేల లీటర్ల పాలు సేకరిస్తుండగా, ఇందిరా మహిళా డెయిరీ ద్వారా దానిని 80 వేల లీటర్లకు పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దశలవారీగా 40 వేల మంది లబ్ధిదారులకు పాడి పశువులను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ ప్రతినిధులను, రిటైర్డ్ ఉద్యోగులను భాగస్వాములను చేసి వారి అనుభవాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఉపాధి హామీ నిధులతో షెడ్ల నిర్మాణం..
లబ్ధిదారులకు అవసరమైన పశువుల షెడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. పశువుల కొనుగోలు ప్రక్రియ లబ్ధిదారుల ఆమోదంతోనే పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. సబ్సిడీ మొత్తాన్ని సకాలంలో జమ చేసేందుకు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, లబ్ధిదారుల కోసం నాన్-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాలను ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పాల దిగుమతిని తగ్గించేందుకు మన జిల్లాలోనే ఉత్పత్తిని పెంచాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఉత్పత్తి అయిన పాలను సేకరించేందుకు ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకోవాలని తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ.. ప్రాజెక్టు అమలు కోసం మండలాల వారీగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

