ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పనులను పూర్తి చేయాలి
2002–2025 డేటా సమన్వయంపై ప్రత్యేక దృష్టి
సీఈఓ కార్యాలయం ఎస్‌డీసీ శ్రీరామ్ ప్రసాద్ ఆదేశం
కాకతీయ, ఖమ్మం: 2002 నుంచి 2025 వరకు ఉన్న డేటాను సమన్వయం చేస్తూ ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పనులను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని హైదరాబాద్ సీఈఓ కార్యాలయ ఎస్‌డీసీ శ్రీరామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాల రికార్డులను సమగ్రంగా పరిశీలించి మ్యాపింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ప్రతి దశలోనూ డేటా నాణ్యతను నిర్ధారించుకోవాలని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పనులు నిర్వహించాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమన్వయంతో ముందుకు..
క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు , సూపర్వైజర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ఓటర్ల వివరాలను సకాలంలో అప్‌డేట్ చేయాలని తెలిపారు. పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీ (ఐపీటీ రైల్వేస్) ఎం.ఏ. రాజు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ అన్సారీ, నాయబ్ తహసీల్దార్, ఖమ్మం(112), పాలేరు(113) నియోజకవర్గాలకు చెందిన బీఎల్వోలు, సూపర్వైజర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

