హెల్త్ ఆఫీసర్ ఛాంబర్లో వీరంగం
కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం.. సిబ్బందిపై దౌర్జన్యం
డిప్యూటీ కమిషనర్‌కు ఉద్యోగ సంఘాల వినతి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కొందరు వ్యక్తులు హంగామా సృష్టించారు. విధుల్లో ఉన్న అధికారులను భయాందోళనకు గురిచేస్తూ, హెల్త్ ఆఫీసర్ ఛాంబర్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనను మున్సిపల్ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సమాచారం ప్రకారం.. అంతిమయాత్ర వాహనం కేటాయింపు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే హెల్త్ ఆఫీసర్ కార్యాలయంలోకి దూసుకెళ్లి సిబ్బందిని బెదిరించడమే కాకుండా, అక్కడి సామగ్రిని చిందరవందరగా పడేశారు. బహిరంగంగానే దౌర్జన్యానికి దిగడంతో కార్యాలయ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమకు రక్షణ కరువైందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్ సువార్తకు ఉద్యోగ సంఘాల నేతలు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతను బలోపేతం చేయాలని, విధుల్లో ఉన్న సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

