ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడు మృతి
కాకతీయ, చిగురుమామిడి: రోడ్డు పక్కన అజాగ్రత్తగా నిలిపిన ట్రాక్టర్ ట్రాలీ ఒక యువకుడి ప్రాణం తీసింది. కరీంనగర్లో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లికి చెందిన గొడుగు మహేష్ (29) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై పృధ్విధర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ కరీంనగర్‌లోని ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి పని ముగించుకుని తన పల్సర్ బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. చిగురుమామిడి మండలం చిన్నమూల్కనూర్ శివారులోని గాగిరెడ్డిపల్లె గ్రామ పరిధిలోకి రాగానే.. రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. బరిగెలేపల్లేకు చెందిన పిట్టల రమేష్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, లైట్లు వేయకుండా, ట్రాలీ డోర్ తెరిచి ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై వివరించారు. తీవ్ర గాయాలైన మహేష్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుని తండ్రి గొడుగు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి మృతితో కొండరాజుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

