ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నారు
ముష్టిపల్లిలో రెండెకరాల కబ్జాకు యత్నం
అధికారుల అండతోనే వెంచర్లు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
గ్రీవెన్స్‌లో న్యాయవాది కైలాస్ కుమార్ సిరస్వాల్ ఫిర్యాదు
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. రాజీవ్ నగర్‌కు చెందిన న్యాయవాది కైలాస్ కుమార్ సిరస్వాల్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విలువైన ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లుగా మారుస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముష్టిపల్లిలోని సర్వే నంబర్ 106లో ఉన్న 12.05 గుంటల పట్టా భూమిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 51లోని సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు బాధితుడు తెలిపారు. గత గ్రామ పంచాయతీ పాలకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై ఎటువంటి అనుమతులు లేకుండానే ఇక్కడ లేఅవుట్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వప్రయోజనాల కోసం ఈ భూమిని ప్లాట్ల రూపంలో విక్రయిస్తున్నారని వివరించారు.
సర్వే చేయించి భూమిని కాపాడాలి
ప్రభుత్వానికి భారీ నష్టం కలిగిస్తున్న ఈ అక్రమ వెంచర్లపై విచారణ జరపాలని ఆయన కోరారు. వెంటనే సంబంధిత సర్వే నంబర్లలో భూమిని సర్వే చేయించి, ప్రభుత్వ భూమిని అక్రమదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని విన్నవించారు. స్వాధీనం చేసుకున్న భూమిని ప్రజా అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

