ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం
టెన్త్, ఇంటర్ టాపర్లకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతుల పంపిణీ
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం
ప్రైవేటుకు ధీటుగా రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
కాకతీయ, కరీంనగర్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “విద్యా విజయోత్సవం” కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ విద్యార్థుల అద్భుత విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. సమాజ నిర్మాణంలో గురువు స్థానం ఎంతో గొప్పదని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, ఉన్నత లక్ష్యాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల సేవలు సమాజానికి దిక్సూచిలా పనిచేస్తాయని కొనియాడారు.
ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఇదే పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన అందుబాటులోకి వచ్చాయన్నారు.
సర్కారు స్కూళ్లపై పెరుగుతున్న ఆసక్తి
ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపిన తల్లిదండ్రులు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్థులు విద్య, క్రీడలు, సాంకేతిక రంగాలతో పాటు వివిధ పోటీ పరీక్షల్లోనూ అద్భుత ప్రతిభ చాటుతున్నారని చెప్పారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులకు ప్రభుత్వ విద్యార్థుల విజయాలే నిదర్శనమని, ఉపాధ్యాయుల అంకితభావం వల్లే ఈ ఫలితాలు సాధ్యమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, విద్యాశాఖ ఏడీ మాధవి, సెక్టోరల్ అధికారులు మిల్కురి శ్రీనివాస్, అశోక్ రెడ్డి, దాసి శ్రీనివాస్, ఉమారాణి, మహేందర్, రవీందర్, డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

