సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించాలి
జెన్కో నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేయాలి
మ్యాన్‌పవర్ లేకుండా ఉత్పత్తి కోసం కార్మికులపై ఒత్తిడి తగదు
ఐఎన్టీయూసీ నేతలు మంత్రులతో ఫోటోలకే పరిమితం
ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య ధ్వజం
కాకతీయ, కొత్తగూడెం: గడిచిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల వివరాలను యాజమాన్యం తక్షణమే ప్రకటించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటీయూసీ) అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య డిమాండ్ చేశారు. అలాగే జెన్కో నుంచి సంస్థకు రావాల్సిన రూ.53,000 కోట్ల భారీ బకాయిలను వెంటనే వసూలు చేసి, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా సింగరేణి మనుగడను కాపాడాలన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఇటీవల డైరెక్టర్ (పర్సనల్)తో జరిగిన చర్చల వివరాలను వెల్లడించేందుకు ఆదివారం ఉదయం కొత్తగూడెంలోని శేషగిరి భవన్లో ఏఐటీయూసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మిర్యాల రంగయ్య మాట్లాడుతూ.. కనీస సౌకర్యాలు, కొత్త యంత్రాలు కల్పించకుండా కేవలం ఉత్పత్తి టార్గెట్ల కోసం కార్మికులపై ఒత్తిడి తెస్తూ జీవోలు జారీ చేయడం, మల్టీ డిసిప్లినరీ కమిటీలను వేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
గడిచిన ఆర్థిక సంవత్సరం లాభాల్లో కార్మికుల వాటాను ప్రకటించకుండా యాజమాన్యం కాలయాపన చేస్తూ కార్మికులను మభ్యపెడుతోందని రంగయ్య మండిపడ్డారు. మెడికల్ బోర్డు చర్చల్లో అంగీకరించిన విధంగానే, పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. పాత గనులు మూతబడుతున్న తరుణంలో ఓబీ (ఓవర్ బర్డెన్) పనులను సింగరేణే స్వయంగా టేక్ ఓవర్ చేసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన సింగరేణి ప్రాజెక్టుల లాభనష్టాలపై యాజమాన్యం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన లేబర్ కోడ్లను సింగరేణిలో అమలు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాల పేరుతో పనిగంటలు పెంచి కార్మికులపై భారం మోపడం మానేసి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి మ్యాన్‌పవర్‌ను పెంచాలని, పాత యంత్రాల స్థానంలో ఆధునిక యంత్రాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు.
అధికార సంఘానికి సవాల్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ తప్పుడు ప్రచారాలతో కార్మికులను మోసం చేస్తోందని రంగయ్య విమర్శించారు. ఐఎన్టీయూసీ నాయకులు మంత్రుల చుట్టూ తిరుగుతూ ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదని, అధికార పార్టీగా ఉండి సింగరేణికి జెన్కో నుండి రావాల్సిన ₹53,000 కోట్ల బకాయిలను వసూలు చేయించి చూపించాలని సవాల్ విసిరారు. కాంట్రాక్ట్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని, యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, పిట్ కార్యదర్శులు మధు, కృష్ణ, కమల్, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

