అక్రమ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలి
వారసత్వ భూమి ఆక్రమణతో రైతు ఆత్మహత్యాయత్నం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు యంత్రాంగం
న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దిగివచ్చిన రైతు
బాధిత రైతు వలబోజు నరసింహాచారి ఆక్రోశం
కాకతీయ, మద్దూరు : తన ప్రమేయం లేకుండా వారసత్వంగా వస్తున్న పట్టా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనోవేదనకు గురై ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్న సంఘటన జాలపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వలబోజు నరసింహాచారి తన తండ్రి వారసత్వంగా వస్తున్న పట్టా భూమిని అక్రమ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రిజిస్ట్రేషన్ పై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతు దిగివచ్చాడు.

