పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కన్నాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1993 నుంచి 1998 వరకు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఉపాధ్యాయులు అందించిన విద్య, మార్గదర్శకత్వం తమ జీవితాల్లో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా ఒకరినొకరు సన్మానించుకుని, పాత అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థి దశలో జరిగిన సంఘటనలు, స్నేహ బంధాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.

