తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు
మునియా తండాలో వైభవంగా వేడుకలు
కాకతీయ, కారేపల్లి: మండలంలోని రావోజి తండా పంచాయతీ పరిధి గల మునియా తండాలో ఆదివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. లంబాడీ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తండా వాసులు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే తండా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో, నెత్తిన బోనాలతో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో మునియా తండా భక్తజనసంద్రంగా మారింది. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడంలో గ్రామ పెద్దలు వాంకుడోత్ నాగేష్, రాజేష్, యుగంధర్, చీమ్న శంకర్, మోహన్, కిషోర్, అశోక్, గాంధీ, వెంకటేష్, కళ్యాణ్, శోభన్, జి.శంకర్ తదితరులు కీలక పాత్ర పోషించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించగా, ప్రజలందరి భాగస్వామ్యంతో బోనాల మహోత్సవం కోలాహలంగా ముగిసింది.

