బైపాస్ వరద కాల్వ పనులు పూర్తి చేయాలి
నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకోవాలి
సీపీఎం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్
నత్తనడకన పనులు సాగుతుండటంపై ఆగ్రహం
కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో చేపట్టిన వరద కాల్వ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ, శ్రీశ్రీ విగ్రహం నుంచి వస్తున్న వరద నీటిని ఎన్టీఆర్ విగ్రహం మీదుగా మున్నేరులో కలిపేందుకు చేపట్టిన కాల్వ పనులు మొదలై రెండు నెలలు గడుస్తున్నా, కనీసం సగం పనులు కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ కాల్వ పనులను ఇష్టారాజ్యంగా, వంకర్లు తిప్పుతూ చేపడుతున్నారని, దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. సైడ్ వాల్ నిర్మాణంలో నాణ్యత లోపిస్తోందని, దీనిపై మున్సిపల్ కమిషనర్ తక్షణమే దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలని కోరారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తి చేయకపోతే బైపాస్ రోడ్డులో వ్యాపార సంస్థలకు, వాహనదారులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. నగరంలో రహదారుల విస్తరణ, డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, సంబంధిత మంత్రి, కమిషనర్ పెండింగ్ పనులపై దృష్టి సారించి నిధులు కేటాయించాలని విక్రమ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దొంగల తిరుపతిరావు, బోడపట్ల సుదర్శన్, జె. వెంకన్న బాబు, జెల్లా ఉపేందర్, భూక్యా ఉపేంద్ర నాయక్, నాగేశ్వరరావు, శెట్టి రవీంద్ర, చిన్న హుస్సేన్, నాగరాజు, బీఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

