- కరీంనగర్ పోలీసుశాఖలో కలకలం
- డబ్బు ఇస్తే కోర్టుకు ‘డూప్లికేట్’ హాజరా..?
- ఫేక్ చలాన్లతో రికార్డుల మాయాజాలమా..?
- సీపీ ఆదేశాలతో విచారణ.. ఒకరు సస్పెండ్, ఇద్దరిపై దర్యాప్తు
- జైలు భయాన్ని ఆసరాగా చేసుకుని భారీగా వసూళ్లు
- ఒక్కో కేసుకు రూ. 15 వేల నుంచి 30 వేల వరకు డిమాండ్
- అసలు నిందితులకు బదులు ‘డూప్లికేట్’ వ్యక్తులతో కోర్టుకు హాజరు
- న్యాయ ప్రక్రియతో పోలీసుల చెలగాటం!
- ఏఆర్ ఏసీపీ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో దర్యాప్తు కమిటీ
కాకతీయ, కరీంనగర్ : మద్యం తాగి వాహనం నడిపేవారిపై కఠినంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీస్ సిబ్బందే ఇప్పుడు ‘అక్రమ దందా’కు పాల్పడటం కరీంనగర్ పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని కోర్టుకు హాజరు కాకుండా చేస్తామని, జైలు శిక్ష పడకుండా చూస్తామని నమ్మబలికి, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు పోలీసు వర్గాల్లో సంచలనంగా మారాయి. అసలు నిందితుల స్థానంలో ఇతరులను కోర్టుకు పంపడం, ఫేక్ చలాన్లతో రికార్డులు మాయం చేయడం వంటి వ్యవహారాలు వెలుగుచూడటంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వాహనదారులకు జైలు శిక్ష పడుతుందనే భయాన్ని కొందరు సిబ్బంది తమకు అదనుగా మార్చుకున్నారు. “డబ్బులిస్తే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు, అన్నీ మేమే చూసుకుంటాం” అని నమ్మబలికి ఒక్కో కేసు విషయంలో రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు చెల్లించిన వారి కోసం, వారి స్థానంలో కోర్టుకు హాజరయ్యే ‘డూప్లికేట్’ వ్యక్తులను సమకూర్చి న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించినట్లు సమాచారం. గుర్తింపు పత్రాల ధృవీకరణలో కూడా అవకతవకలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫేక్ చలాన్లు.. ప్రభుత్వానికి గండి!
ఈ వ్యవహారంలో చలాన్ల జారీ విధానంపై కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారుల నుంచి వసూలైన మొత్తం ప్రభుత్వ ఖాతాలోకి ఎంత వెళ్తోంది? మధ్యలో ఎంత మొత్తం అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారు? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అసలు నిందితుల స్థానంలో హాజరైన ఆ డూప్లికేట్ వ్యక్తులు ఎవరు? వారికి ఎవరు డబ్బులు ఇచ్చారు? అనే ప్రశ్నలకు ఇప్పుడు కమిటీ సమాధానాలు వెతుకుతోంది. బ్రీత్ అనలైజర్ రికార్డులను, కోర్టు హాజరు వివరాలను సరిపోల్చితే ఈ అవినీతి సామ్రాజ్యం ఎంత విస్తృతమైనదో బయటపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
రంగంలోకి విచారణ కమిటీ.. కఠిన చర్యలకు సిద్దం
ఈ అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెంటనే స్పందించారు. ఏఆర్ ఏసీపీ సి. ప్రతాప్ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. అందులో ఒక కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడగా, మిగతా వారిపై విచారణ కొనసాగుతోంది. “ఈ అక్రమాల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదు” అని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. కేవలం ఒక కానిస్టేబుల్ సస్పెన్షన్తోనే ఈ కేసు ముగిసిపోకూడదని, ఎన్ని కేసుల్లో ఈ విధంగా అక్రమాలు జరిగాయి, ఇందులో మరికెవరి పాత్ర ఉంది? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసిన ఈ ఉదంతం, కరీంనగర్ పోలీసు శాఖలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

